Daily Current Affairs in Telugu: 2022, ఏప్రిల్ 30 కరెంట్‌ అఫైర్స్‌

Avian Influenza: మనిషిలో తొలిసారి బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ఏ దేశంలో గుర్తించారు?

ఇంతవరకు పక్షులకు మాత్రమే పరిమితమైన బర్డ్‌ఫ్లూ మనుషుల్లోనూ కనిపిస్తోంది. అమెరికాలో కొలరాడోలోని ఒక కోళ్లఫారంలో పనిచేసే వ్యక్తికి హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకటించింది. ఈ వ్యక్తి పనిచేసే కోళ్లఫారంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి ఉంటుందని, వీటిని మూకుమ్మడిగా అంతం చేసే పని ఇతనికి అప్పగించారని, ఆ సమయంలో ఏవియన్‌ ఫ్లూ వైరస్‌ (బర్డ్‌ఫ్లూ) సోకి ఉంటుందని పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ తెలిపింది. అమెరికాలో ఇది తొలి బర్డ్‌ప్లూ కేసు(మనుషులకు సోకడం) కాగా, ప్రపంచంలో మూడోది. తొలి కేసు బ్రిటన్‌లో, రెండో కేసు చైనాలో నమోదైన విషయం విదితమే. పక్షుల్లో ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ వల్ల బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుంది. వాటిని ఐసోలేట్‌ చేసి చంపడం ద్వారా ఇతర పక్షులకు సోకకుండా జాగ్రత్త పడతారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికాలో తొలిసారి మనిషిలో  ఏవియన్‌ ఫ్లూ వైరస్‌ (బర్డ్‌ఫ్లూ) గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 29
ఎవరు    : అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌
ఎక్కడ    : కొలరాడో, అమెరికా

Judicial Conference: 39వ హైకోర్టు సీజేల సదస్సును ఎక్కడ నిర్వహించారు?

ఆరేళ్ల విరామం తర్వాత ఏప్రిల్‌ 29న న్యూఢిల్లీలో జరిగిన 39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించడం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని చెప్పారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : ఏప్రిల్‌ 29
ఎవరు    : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించే విషయమై..​​​​​​​

Semicon India Conference 2022: సెమికాన్‌ ఇండియా తొలి సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?

కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఏప్రిల్‌ 29న ‘సెమికాన్‌ ఇండియా–2022’ సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫనెన్స్‌ ద్వారా మాట్లాడారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్‌ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్‌ డాలర్ల విలువైన సెమికండక్లర్లు అవసరమన్నారు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్‌ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు.

దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సును ఏప్రిల్‌ 29–మే 1 మధ్య బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సెమికాన్‌ ఇండియా–2022 తొలి సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 29
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చేందుకు..

Vice Chief of the Army Staff: భారత ఆర్మీ కొత్త వైస్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

భారత ఆర్మీ కొత్త వైస్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు నియమితులయ్యారు. మే 1వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని రక్షణ శాఖ ఏప్రిల్‌ 29న వెల్లడించింది. ప్రస్తుత వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్మీ చీఫ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు.

దివాలా కేసులో జైలు శిక్ష విధింపబడిన ఆటగాడు?
దివాలా కేసులో జర్మనీ టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్‌ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్‌ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది.

జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్‌ బెకర్‌ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్‌ మొత్తం ఆరు (వింబుల్డన్‌ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–1991, 1996; యూఎస్‌ ఓపెన్‌–1989) గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత ఆర్మీ కొత్త వైస్‌ చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 29
ఎవరు    : లెఫ్టినెంట్‌ జనరల్‌ బగ్గవల్లి సోమశేఖర్‌ రాజు
ఎందుకు : ఇప్పటివరకు ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్మీ చీఫ్‌గా నియమితులైన నేపథ్యంలో..

Driverless Taxi: సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?

ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబో ట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్‌ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్‌ దక్కించుకుంది. బీజింగ్‌లోనూ సేవలు ఆఫర్‌ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్‌ దిగ్గజం బైడూ లైసెన్స్‌ పొందింది. బీజింగ్‌లో 67 అటానమస్‌ (డ్రైవర్‌ రహిత) వెహికిల్స్‌ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది.

భారత విద్యార్థులను అనుమతిస్తాం: చైనా
కోవిడ్‌ మహమ్మారి ప్రబలిన సమయంలో 2019లో చైనా నుంచి భారత్‌ వెళ్లిన విద్యార్థుల్లో కొందరిని తిరిగొచ్చేందుకు అనుమతిస్తామని చైనా తెలిపింది. ఆ మేరకు జాబితాను అందించాలని భారత్‌ను కోరామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచంలో తొలిసారి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 29
ఎవరు    : పోనీ.ఏఐ 
ఎక్కడ    : క్వాంజో, చైనా

Healthcare Services: వైద్య సేవలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది?

వైద్యులు, ఆరోగ్య సేవలు సైతం వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం సమర్థించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మెడికోస్‌ లీగల్‌ యాక్షన్‌ గ్రూప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ప్రస్తుతం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విస్తరించబోయే 17 జాతీయ రహదారుల పనులకు ఏప్రిల్‌ 29న  కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అలాగే విస్తరణ పనులు పూర్తి చేసుకున్న రెండు జాతీయ రహదారులను ఆయన జాతికి అంకితం చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఎరీనాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారులు 2024 నాటికి అమెరికా స్థాయి ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి 2024 నాటికి పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారుల విస్తరణ జరుగుతుందని చెప్పారు.

Digital Payments: దేశంలో రోజుకు ఎన్ని కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయి?

దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్‌ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఏప్రిల్‌ 24న మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని ఈ విషయాలను వెల్లడించారు. 2022, మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. చిన్న చిన్న ఆన్‌లైన్‌ పేమెంట్లు భారీ డిజిటల్‌ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ ముందుకు వస్తున్నాయని తెలిపారు.

యూఏఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ ఒప్పందం
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని రువాయిస్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అబుధాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ (త’జీజ్‌) ఏప్రిల్‌ 26న వాటాదారుల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుపై 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తదితర రసాయనాలను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించాయి.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు?
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్‌ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్‌ తెలిపింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది.

ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ మృతి
ఉక్రెయిన్‌ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’గా పేరు పొందిన మేజర్‌ స్టెపాన్‌ టారాబాల్కా(29) మార్చి నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్‌ చెబుతోంది.

కీలక బిల్లుకు అమెరికా ఆమోదం
ఉక్రెయిన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఏప్రిల్‌ 29న ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు.​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, ఏప్రిల్ 29 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

General Essay - International

​​​​​​​​​​​​​​Report on Food Crises: ఆహార సంక్షోభం ముంగిట్లో...

 

ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్‌(డెన్మార్క్‌ రాజధాని) కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్‌ కౌంట్స్‌’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది.

World Malaria Day: మలేరియా లేని ప్రపంచం కోసం...

భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్‌ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్‌ దివంగత ఎడ్వర్డ్‌ విల్సన్‌ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు.

మాంసాహారంతో నష్టమేమిటి?
శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్‌ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే.

ధరలు ఆకాశానికి..
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్‌ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక!

క్రమక్షయంతో పెనుముప్పు
పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్‌ వాడి ఫండ్‌’ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేసన్‌ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి.

ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు!
ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్‌ కౌంట్స్‌’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్‌ వేస్టేజ్‌ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్‌ హార్వెస్టింగ్‌ లాస్‌) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్‌ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా.

Driverless Taxi: సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి?​​​​​​​

General Essay - Science and Technology

​​​​​​​Fungi-Plant Communication Network: హైఫే అని వేటిని అంటారు?

పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్‌ భాషలో సమాచార ప్రసారం చేసుకుంటాయని.. వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్‌ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధనలో వెల్లడైంది.

పరిశోధన ప్రకారం... ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్‌ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్‌లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్‌ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్‌వర్క్‌ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు.

Fish Species: ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ఏమని అంటారు?

ఇలా కనుగొన్నారు

  • చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్‌ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్‌ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్‌)తో పోలినట్లు గుర్తించారు.
  • ఫంగస్‌ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్‌ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్‌ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు.
  • దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు.
  • ఫంగస్‌లు భూమిలోపల అంతర్గత నెట్‌వర్క్‌తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. 
  • ఫంగస్‌ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది.
     

Hubble Space Telescope: జోవియన్‌ గ్రహాలు అని ఏ గ్రహాలను పిలుస్తారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags