India, Kuwait: భారత్, కువైట్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు.. ప్రధాని మోదీ కువైట్‌ పర్యటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబ‌ర్ 21వ తేదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గల్ఫ్‌ దేశమైన కువైట్‌కు చేరుకున్నారు.

కువైట్‌ రాజు షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబా ఆహ్వానం మేరకు ఆయన కువైట్‌లో అడుగుపెట్టారు. భారతదేశ ప్రధానమంత్రి కువైట్‌లో పర్యటిస్తుండడం గత 43 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు.  

మోదీ డిసెంబ‌ర్ 21వ తేదీ కువైట్‌ సిటీలో ‘హలా మోదీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కువైట్‌లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ ప్రగతిలో మన భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.   
 
కువైట్‌ రాజుతో ప్రధాని మోదీ భేటీ 
మోదీ డిసెంబ‌ర్ 22వ తేదీ కువైట్‌ సిటీలోని మెజెస్టిక్‌ బయన్‌ ప్యాలెస్‌లో కువైట్‌ రాజు, ప్రధాని షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చే దిశగా చర్చలు జరిపారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఫిన్‌టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాకిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. భారత్‌లో పర్యటించాలని కువైట్‌ రాజును మోదీ ఆహ్వానించారు. 

India, Sri Lanka: భారత్‌, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు

షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబాతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో భారత్, కువైట్‌ సంబంధాలు ఉన్నతంగా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అవగాహన ఒప్పందాలు 
ప్రధాని మోదీ, కువైట్‌ రాజు చర్చల సందర్భంగా భారత్, కువైట్‌ మధ్యపలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రీడలు, సంస్కృతి, సోలార్‌ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు, రక్షణ పరికరాల సరఫరా, ఉమ్మడిగా సైనిక విన్యాసాలు, శిక్షణ, నిపుణులు, జవాన్ల మార్పిడి, పరిశోధన–అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు. ప్రస్తుతం కువైట్‌ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్‌ కో–ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్‌ ఆసక్తి చూపింది.

India-Guyana Relations: గయానాతో 10 ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ..

#Tags