Laureus World Sports Awards: లారియస్‌ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ అవార్డుల్లో ఉత్తమ క్రీడాకారులుగా మెస్సీ, షెల్లీ

గత ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేసిన ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ (అర్జెంటీనా), మహిళా అథ్లెట్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ (జమైకా)లకు ప్రతిష్టాత్మక లారియస్‌ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ అవార్డులు లభించాయి.

2022 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా మెస్సీ.. మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా షెల్లీ ఎంపికయ్యారు. మెస్సీ సారథ్యంలో గత ఏడాది అర్జెంటీనా జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను మూడోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్‌ చేయడంతోపాటు సహచరులు మూడు గోల్స్‌ చేయడానికి సహాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఉత్తమ ప్లేయర్‌గా నిలిచి ‘గోల్డెన్‌ బాల్‌’ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. లారియస్‌ అవార్డు రావడం మెస్సీకిది రెండోసారి. 2020లోనూ మెస్సీకి ఈ పురస్కారం దక్కింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
మరోవైపు షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ 100 మీటర్ల విభాగంలో ఐదోసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా షెల్లీ మూడు ఒలింపిక్స్‌ పసిడి పతకాలను, పది ప్రపంచ చాంపియన్‌షిప్‌ బంగారు పతకాలను గెల్చుకుంది. స్పెయిన్‌ టెన్నిస్‌ యువతార కార్లోస్‌ అల్‌కరాజ్‌కు ‘బ్రేక్‌త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించింది. గత ఏడాది అల్‌కరాజ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విజేతగా నిలువడంతోపాటు ప్రపంచ  నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. 1999 నుంచి లారియస్‌ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ అవార్డులను
అందజేస్తున్నారు. 

Madrid Open: మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న సబలెంకా
 

#Tags