Best Course of Intermediate : 'ఇంటర్'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?
ఇప్పుడు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల మదిలో ఒకటే ఆలోచన.. ఇంటర్‌లో ఏ కోర్సు తీసుకుంటే.. బెస్ట్ కేరీర్ ఉంటుంది..? ఏఏ కోర్సు తీసుకుంటే.. ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి..? ఇలా మొదలైన ఆలోచనలతో టెన్త్ విద్యార్థులు ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) టెన్త్ విద్యార్థుల మంచి భవిష్యత్ కోసం.. ప్రముఖ కెరీర్ నిపుణులు ద్వారా విలువైన సూచనలు.. సలహాలు.. మీకోసం..
పదో తరగతి పాసయ్యాను సరే..! మరి తర్వాత ఏం చేయాలి ? ఇంటర్‌లో చేరాలా ? చేరితే ఏ గ్రూపులో చేరాలి ? ఒకేషనల్ కోర్సులో చేరితే ఏ ట్రేడ్‌ను ఎంపిక చేసుకోవాలి ? ఇలా మొదలైన ఆలోచనలు ఉంటాయి. అలాగే కామర్స్ దిశగా వెళ్తే చిన్న వయసులోనే లక్షల వేతనాలు వస్తాయట కదా..? పదో తరగతి ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థుల మొదట్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కదలాడుతుంటాయి! ప్రస్తుతం అపార అవకాశాలున్న క్రమంలో.. ఇంటర్‌లో గ్రూప్ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. ఈ విషయంలో ఉపయోగపడేలా నిపుణుల సలహాల సమాహారం ఇలా..
ఇంటర్‌లో గ్రూప్ ఎంపికే కీలక పాత్ర.. :
ఏ విద్యార్థికైన పదో తరగతి పూర్తయిందంటే.. కోరుకున్న కెరీర్‌ను సాధించే క్రమంలో తొలి అడుగు పడినట్లే. అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకునే గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అమ్మానాన్న, స్నేహితులు, సీనియర్లు, శ్రేయోభిలాషుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్వీయ సామర్థ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి.
భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన, వాటి సాధనకు సరితూగే కార్యాచరణ ఉంటే ప్రపంచ వ్యాప్తంగా పుష్కల అవకాశాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ గ్రూప్ తీసుకున్నా కెరీర్ బంగారమే అవుతుందన్నది గుర్తించాలి.
ఇంటర్‌లో 'ఎంపీసీ' గ్రూప్ వల్ల ఉపయోగాలు ఇవే..
మీకు మ్యాథమెటిక్స్ అంటే అమితాసక్తి ఉండి.., ఒక సమస్యను విశ్లేషించి, వేగంగా సాధనను కనుక్కొనే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులకు నిరంతర అధ్యయనం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సమకాలీన పరిణామాలపై అవగాహన అవసరం. సివిల్, మెకానికల్ వంటి సంప్రదాయ విభాగాలతో పాటు జియోటెక్నికల్, నానో ఇంజనీరింగ్ వంటి అధునాత బ్రాంచ్‌ల సమ్మేళనంగా ఉన్న ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు ఎంపీసీ సరైన గేట్ వే.
☛ AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?
ఇంటర్ పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ-మెయిన్ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీ, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో ప్రవేశించొచ్చు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో సంబంధమున్న విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనల దిశగా కూడా వెళ్లొచ్చు.
ఎంపీసీ తర్వాత యూజీ స్థాయిలో బీఎస్సీ పూర్తిచేశాక ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అందుకోవచ్చు. అయితే సహనం ప్రధానం. ఓర్పు, నేర్పు ఉంటే కొంత అధిక సమయం తీసుకున్నా ఉజ్వల కెరీర్ ఖాయం. ఆర్ అండ్ డీ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, బెవరేజెస్ కంపెనీలు వంటివి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా పీజీ/పీహెచ్‌డీ అర్హతతో శాస్త్రవేత్తలుగా, సైంటిఫిక్ అసిస్టెంట్‌గా అవకాశాలు ఉంటాయి.
ఎంపీసీ విద్యార్థులకు ఇవి ఉండాలి..:
గణితంపై అమితాసక్తి, సమస్యల సాధనకు అందుబాటులో ఉన్న మార్గాలను గుర్తించే నైపుణ్యం అవసరం. నిరంతర అధ్యయనం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సమకాలీన పరిణామాలపై అవగాహన తప్పనిసరి
ఇంటర్‌లో 'బైపీసీ' గ్రూప్ వల్ల ఉపయోగాలు ఇవే..
టెన్త్ పూరైన విద్యార్థులకు.. నేచురల్ సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారికి సరైన గ్రూప్ బైపీసీ. మొక్కలు, జంతువుల స్థితిగతులను పరిశీలించడం ఇష్టమున్న వారు ఈ గ్రూప్‌లో చేరొచ్చు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాలి కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి.
ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాలను ప్రయోగశాలలో పరిశీలించేలా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, జిప్‌మర్, సీఎంసీ, ఎయిమ్స్ వంటి పరీక్షల్లో ప్రతిభ కనబరచడం ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్ కెరీర్‌లో స్థిరపడేందుకు అధిక సమయం అవసరం. ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. దీనర్థం బైపీసీ గ్రూప్‌లో చేరొద్దని కాదు! కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్వీయ ఆసక్తి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
బైపీసీ తర్వాత బీడీఎస్, పారామెడికల్, అగ్రికల్చర్, హోమియోపతి తదితర కోర్సుల్లోనూ చేరొచ్చు. లేదంటే యూజీ స్థాయిలో నచ్చిన గ్రూప్‌లో చేరొచ్చు. తర్వాత పీజీ, పరిశోధనలు దిశగా అడుగులు వేయొచ్చు.
'బైపీసీ' విద్యార్థులకు ఇవి తప్పనిసరిగా ఉండాలి..
మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండాలి. పట నైపుణ్యాలను పెంపొందించుకోవడం తప్పనిసరి. ప్రాక్టికల్స్ ద్వారా జ్ఞాన సముపార్జన అవసరం. సహనం, కష్టపడేతత్వం ఉండాలి.
ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీ వల్ల ఉపయోగాలు ఇవే..
పదో తరగతి పూరైన విద్యార్థులు.. సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే స్వభావం, క్యాలిక్యులేషన్స్, వ్యాపార లావాదేవీల చిట్టాపద్దులు (అకౌంట్స్), స్టాటిస్టిక్స్‌పై ఆసక్తి ఉన్నవారికి అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్); ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్). వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లతో కూడిన ఆర్థిక కార్యకలాపాలను వివరించే శాస్త్రం కామర్స్.
ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణలో పెరుగుదల, దేశంలోకి బహుళజాతి కంపెనీలు అడుగుపెడుతుండటం, సేవా రంగం శరవేగంగా విస్తరిస్తుండటం వల్ల సుశిక్షితులైన కామర్స్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారు కామర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న సీఈసీ/ఎంఈసీలో చేరొచ్చు. చిన్న వయసులోనే కళ్లుచెదిరే వేతనాల కొలువులకు దగ్గర చేసే సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసేందుకు ఈ గ్రూప్‌లు ఉపకరిస్తాయి.
మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే సీఏ సీపీటీని విజయవంతంగా పూర్తి చేయొచ్చు. చిన్నవయసులోనే భారీగా వేతనాలు వచ్చే ఉద్యోగాలను పొందేందుకు మార్గాలుగా సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌లు నిలుస్తున్నాయి.
ఇంటర్ తర్వాత సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరని వారు, బీకాంలో చేరొచ్చు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే ఎంకామ్, పీహెచ్‌డీ చేయొచ్చు.
ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు ఇవి ఉంటే.. ఇంకా బెస్ట్.. :
సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే స్వభావం, క్యాలిక్యులేషన్స్, వ్యాపార లావాదేవీల చిట్టాపద్దులు (అకౌంట్స్)పై ఆసక్తి ఉన్నవారికి అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ..
ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూప్.. ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన దారి..!
ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రాత నైపుణ్యాలు, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టితో పాటు సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్న వారికి ఎంతో చక్కని గ్రూప్ హెచ్‌ఈసీ.
ఇంటర్ హెచ్‌ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకుని ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్‌ఈసీ తర్వాత అనేక అవకాశాలున్నాయి. ఒకప్పుడు హెచ్‌ఈసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్ తదితర వృత్తి విద్య స్పెషలైజేషన్లు) అందుబాటులోకి వచ్చాయి.
హెచ్‌ఈసీ విద్యార్థులకు.. ఈ నైపుణ్యాలు ఉండాలి..:
విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టితో పాటు సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్న వారికి సరైన గ్రూప్ హెచ్‌ఈసీ.
ఇంటర్ ఒకేషనల్ కోర్సులు..
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.. ఇంటర్‌లో చాలా మంది ఎంపిక చేసుకునే గ్రూపులివి ! ఉన్నత విద్యా కోర్సుల్లో చేరి, నచ్చిన కెరీర్‌ను అందుకునేందుకు ఇవి బాటలు వేస్తాయి. అయితే పది తర్వాత రెండేళ్లకే పదిలమైన ఉపాధిని అందించే కోర్సులు ఒకేషనల్ కోర్సులు. విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని ఇంటర్ వొకేషనల్ కోర్సులు అందిస్తున్నాయి.
ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం సముపార్జనకు, క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సన్నద్ధత అవసరం. ప్రస్తుతం ఇంటర్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్,ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర కోర్సులున్నాయి.
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలంటే..?
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే 10 శాతం కోటా కింద సంబంధిత పాలిటెక్నిక్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరొచ్చు. బీఏ, బీకామ్ కోర్సుల్లోనూ ప్రవేశించవచ్చు.
ఉన్నత విద్య కాకుండా ఉపాధి కావాలంటే చేసిన కోర్సులను బట్టి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు.
విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని ఇంటర్ వొకేషనల్ కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో చేరాలనుకునే వారికి ప్రాక్టికల్ పరిజ్ఞానం సముపార్జనకు, క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సన్నద్ధత అవసరం.
గ్రూపు ఆధారంగానే విద్యార్థి భవిష్యత్తు.. ఎలా అంటే..?
పదో తరగతి పరీక్షల్లో విజయం సాధించడం పూర్తయిందంటే.. విద్యార్థులు తమ విద్యా జీవితంలో ఒక మైలురాయిని చేరుకున్నట్లే! ఆపై ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకునే గ్రూపు ఆధారంగానే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదో తరగతిలో ఏ సబ్జెక్టులో మార్కులు ఎక్కువగా వచ్చాయి..? ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లపై ఆసక్తి కనబరిచారా..? లేదంటే బొమ్మలు బాగా వేయగలిగి, జీవశాస్త్రాలపై ఆసక్తి చూపారా..? విశ్లేషించుకోవాలి. వీటి ఆధారంగానే ఇంటర్‌లో గ్రూపును ఎంపిక చేసుకోవాలి.
గ్రూపు ఎంపిక విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తేకూడదు. పిల్లల ఆసక్తి, సామర్థ్యం ఆధారంగా మార్గనిర్దేశనం చేయాలి. లేదంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. ఇతర గ్రూపులతో పోల్చితే బైపీసీ గ్రూపును ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు మరింత బాగా ఆలోచించాలి.
టెన్త్ తర్వాత ఇంటర్, ఇతర కోర్సుల్లో చేరాలనే విద్యార్థులకు పైన తెలిపిన ప్రముఖ కెరీర్ నిపుణుల విలువైన సూచనలు.. సలహాలు.. మీ బంగారు భవిష్యత్ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.