University Grants Commission News: ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా అనుమతిచ్చే ముందు అడగండి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా ఇచ్చేప్పుడు తమను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను కోరింది. ఇష్టానుసారం అనుమతులిస్తే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కాలేజీలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా, ఇతరత్రా సమస్యలు వచ్చినా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.
కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా అనుమతులు పొందుతుంటే, రాష్ట్రంలోని ఇతర కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. మల్లారెడ్డి సంస్థలకు ఇటీవల కేంద్రం డీమ్డ్ హోదా ఇచ్చింది. మహేంద్ర యూనివర్సిటీకి కూడా ఇచ్చే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో యూజీసీతో పాటు ఏఐసీటీఈకి రాష్ట్ర విద్యాశాఖ లేఖ రాసింది.
ఇవి కూడా చదవండి : AP 10th Class Exam Fees: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
చిన్న కాలేజీలు విలవిల
డీమ్డ్, అటానమ్ కాలేజీలు పెద్దఎత్తున ప్రచారం చే సుకుంటున్న నేపథ్యంలో చిన్న ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా తయారైందని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. 2016 నాటికి రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నా యి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది.
ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11 ఉంటే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కని్పస్తోంది. చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అటానమస్, డీమ్డ్ వర్సిటీలు వస్తే మరికొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, దీనివల్ల పేద వర్గాలకు ఇంజనీరింగ్ విద్య మరింత ఖరీదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎస్‌ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సుల వైపే విద్యార్థులు వెళ్తున్నారు. కొత్తగా వచ్చే కాలేజీలు ఈ కోర్సులనే ఆఫర్ చేయడం, భారీగా సీట్లు అమ్ముకునేందుకు డీమ్డ్ హోదా తెచ్చుకోవడం సరైన విధానం కాదని మండలి పేర్కొంటోంది.
ఇవి కూడా చదవండి : CBSE Board Exams 2025 : ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలు
విదేశీ వర్సిటీలొస్తే మరింత ముప్పు!
దేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇటలీలోని వర్సిటీలు ముందుకొస్తున్నాయి. వాటి బ్రాంచీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతున్నాయి. విదేశాల్లో విద్యపై ఆసక్తి చూపించే విద్యార్థులను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువని, కొన్ని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే వాదన విన్పిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత పెంచాలని ఏఐసీటీఈ.. రాష్ట్రానికి సూచించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యలో మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు.
ముందే తెలియజేస్తే బాగుంటుంది
డీమ్డ్, అటానమస్ హోదా ఇచ్చేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ముందే తెలియజేయాలని కోరుతూ యూజీసీకి లేఖ రాశాం. మా విజ్ఞప్తిని యూజీసీ పరిగణనలోనికి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రమేయం లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
–ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)