AP TET 2024 Notification Released : ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
అలాగే మెగా డీఎస్సీ-2024కి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. జూలై 2వ తేదీన (మంగళవారం) నుంచి cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెల్సిందే.
☛➤ ఏపీ టెట్-2024 సిలబస్ కోసం క్లిక్ చేయండి
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. ‘టెట్’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష! టెట్‌లో పొందిన మార్కులకు డీఎస్సీ ద్వారా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీ టెట్ వివరాలు, పరీక్ష విధానం, పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
చదవండి: AP TET ప్రివియస్ పేపర్స్
టెట్ ఉత్తీర్ణతతోనే.. డీఎస్సీకి అర్హత :
ఎన్‌సీటీఈ, విద్యా శాఖ నిబంధనల ప్రకారం–టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే.. డీఎస్సీకి అర్హత లభిస్తుంది. డీఎస్సీ నిర్వహణకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కారు.. టెట్ నిర్వహణ సైతం చేపడుతోంది. దీనిద్వారా ఇప్పటి వరకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించని వారికి మరో అవకాశం కల్పించినట్లయింది. అంతేకాకుండా టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది.
నాలుగు పేపర్లుగా టెట్ :
ఏపీ టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. బోధన తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు. ఆ వివరాలు..
- పేపర్–1ఎ: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్.
- పేపర్–1బి: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్.
- పేపర్–2ఎ: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్.
- పేపర్–2బి: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష.
అర్హతలు :
ఆయా పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీతోపాటు డీఈడీ /బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం తదితర అర్హతలు ఉండాలి. సదరు అర్హత పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
లాంగ్వేజ్ టీచర్ అర్హతలివే..
ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు.. లాంగ్వేజ్ టీచర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్ ఉతీర్ణులవ్వాలి. లేదా.. సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ ఉత్తీర్ణతతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీతో బీఈడీలో ఉత్తీర్ణత తప్పనిసరి.
టెట్ పేపర్లు–పరీక్ష విధానాలు :
- పేపర్–1ఎ, 1బి:
- పేపర్–1ఎ, పేపర్–1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు.
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ; లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు. - పేపర్–2ఎ:
ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు–30 మార్కులు; లాంగ్వేజ్–1, 30 ప్రశ్నలు–30 మార్కులు; లాంగ్వేజ్–2, ఇంగ్లిష్ 30 ప్రశ్నలు–30 మార్కులు; సంబంధిత సబ్జెక్ట్, 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని; సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని, లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్‌ను ఎంచుకుని పరీక్ష రాయాలి. - పేపర్–2బి:
పేపర్–2బిని కూడా పేపర్–2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. మొదటి మూడు విభాగాలు పేపర్–2ఎ లోనివే ఉంటాయి. నాలుగో విభాగంగా మాత్రం.. డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజీ ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు–60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
కనీస అర్హత మార్కుల నిబంధన..
టెట్‌లో.. అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.
మంచి మార్కులకు మార్గమిదే.. :
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి :
ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి.
లాంగ్వేజ్–1,2
లాంగ్వేజ్–1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా లాంగ్వేజ్–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ .. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
చదవండి: టెట్ బిట్ బ్యాంక్
మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ :
పేపర్–1లో ఉండే ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు; పేపర్–2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్‌తోపాటు సమకాలీన అంశాలపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్యర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదవడం లాభిస్తుంది.
సైన్స్ :
ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటివి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
సోషల్ స్టడీస్ :
హైస్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి. అదే విధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మొదలు.. తాజా సవరణల వరకు సమన్వయంతో చదవాలి.
మెథడాలజీ :
ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్–1, పేపర్–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.