భారత రాష్ట్రపతి - అధికారాలు

కేంద్ర ప్రభుత్వ అధినేతగా రాష్ట్రపతికి శాసన సంబంధ, కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. అవి.. పార్లమెంటును సమావేశపరచటం, నిరవధిక వాయిదా వేయటం, ఏటా పార్లమెంటు మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించటం, సందేశాలు పంపడం, లోక్‌సభకు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులను నియమించటం, దిగువ సభను రద్దు చేయటం, పార్లమెంటు సమావేశం లేనప్పుడు మంత్రి మండలి సలహా మేరకు 123 రాజ్యాంగ ప్రకరణ ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేయటం, పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు అనుమతినివ్వటం...
రాష్ట్రపతి అధికారాలు
సాధారణ బిల్లులైతే వాటిని అనుమతించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ద్రవ్య ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు, 31-ఎ(1) ప్రకరణకు సంబంధించిన బిల్లులు, వాణిజ్య స్వేచ్ఛను పరిమితం చేసే రాష్ట్ర బిల్లులు (304 ప్రకరణ) రాష్ట్రపతి అనుమతితోనే (అవి సాధారణ బిల్లులైనప్పటికీ) ప్రవేశపెట్టాలి. రాజ్యాంగ సవరణ బిల్లులను తిరస్కరించే అధికారం 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతికి లేదు. భారత రాష్ట్రపతికున్న వీటో(తిరస్కరించే) అధికారం మూడు రకాలు అవి.. నిరపేక్ష, తాత్కాలిక నిలుపుదల, పాకెట్. సాధారణ బిల్లుల విషయంలో ఈ 3 రకాల వీటో అధికారాలు చెలాయించవచ్చు. తిరస్కరించటం నిరపేక్ష వీటో; పునఃపరిశీలనకు పంపటం తాత్కాలిక వీటో, నిరవధిక కాలం బిల్లును తనవద్ద ఉంచుకోవటం పాకెట్ వీటో.

రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు
కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి చేసే నియామకాలు.. లోక్‌సభకు ఎన్నికలు జరిగాక, ప్రధానమంత్రిని నియమించటం, ప్రధానమంత్రి సలహాతో ఇతర మంత్రులను నియమించటం, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రాల గవర్నర్లను; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూ ర్తులను, అటార్నీ జనరల్‌ను, యూనియన్/ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను, ఆర్థిక సంఘాన్ని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను, త్రివిధ దళాధిపతులను నియమించటం. రాజ్యాంగంలోని 53వ ప్రకరణ ఈ అధికారాలను రాష్ట్రపతికి కల్పించినా.. 74వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి సలహా మేరకు వీటిని వినియోగించాలి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి విధిగా దీన్ని పాటించాలి. అయితే 44వ రాజ్యాంగ సవరణ ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం రాష్ట్రపతి తాను ఇచ్చిన సలహాను పునఃపరిశీలించమని మంత్రి మండలిని కోరవచ్చు. మొత్తం మీద 42, 44 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలను చాలా వరకు తగ్గించాయి.

వారధిగా...
78వ రాజ్యాంగ ప్రకరణ మేరకు రాష్ట్రపతికి, మంత్రిమండలికి వారధిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది. ప్రధానమంత్రి తెలియజేయకపోతే ఆ విషయాలను తన దృష్టికి తీసుకు రావాలని రాష్ట్రపతి ఆదేశించవచ్చు. 72వ ప్రకరణ మేరకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. మరణ శిక్ష రద్దు, ఆ శిక్షను వేరే శిక్షగా మార్చే అధికారం ఉంది. 352, 360 ప్రకరణల ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం ఉంది. 356వ ప్రకరణ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం (రాష్ట్రపతి పాలన దిశగా) ఉంది.

ఉపరాష్ట్రపతి
అనారోగ్యం, ఇతర కారణాలతో రాష్ట్రపతి బాధ్యతలు నిర్వ ర్తించలేకపోయినా.. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల (ఎన్నికైన వారు, నామినేటెడ్ సభ్యులు) నియోజకగణం.. నైష్పత్తిక ప్రాతినిథ్య విధానం ద్వారా ఓటు బదలాయింపు పద్ధతిపై ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓట్లు లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల తరహాలో ఓటు విలువను లెక్కించే విధానం ఉండదు. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు రాజ్యసభ అధ్యక్షునిగా వ్యవహరించరు. ఈ పదవికి పోటీ చేయాలంటే భారతదేశ పౌరుడై 35 సంవత్సరాలు నిండాలి. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి. పోటీదారుని అభ్యర్థిత్వాన్ని నియోజకగణంలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపర్చాలి. ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానం ఆమోదించి.. దాన్ని లోక్‌సభ మెజారిటీ సభ్యులు కూడా ఆమోదిస్తే, ఉప రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. వీలైనంత త్వరగా కొత్త ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఎన్నుకోవాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయొచ్చు.

మంత్రి మండలి
పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి.. వాస్తవ కార్యనిర్వాహక వర్గం. ప్రధానమంత్రి, ఇతర మంత్రులతో కూడిన ఈ వ్యవస్థ కార్వనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి పేరిట చెలాయిస్తుంది. మంత్రిమండలిలో సీనియర్ మంత్రులను కేబినెట్‌మంత్రులని, వారి సహాయకులను స్టేట్ మినిస్టర్స్ అని పిలుస్తారు. రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. వాస్తవానికి లోక్‌సభ విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతారు. మంత్రిగా నియమితులైన వ్యక్తి పార్లమెంటు సభ్యుడై ఉండాలి. నియామక సమయానికి సభ్యత్వం లేకపోతే ఆర్నెల్ల లోపు సభ్యత్వం పొందాలి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ప్రకారం మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు. మంత్రి మండలి లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.

అటార్నీ జనరల్
76వ రాజ్యాంగ ప్రకరణ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించటానికి అర్హతలున్న వ్యక్తిని అటార్నీ జనరల్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్.. ప్రధాన న్యాయ సలహాదారునిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం పదవిలో కొనసాగుతారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి ఆయనకు అధికారం ఉంటుంది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని, అవసరమైన న్యాయపరమైన సమాచారం ఇస్తారు. అయితే పార్లమెంటులో ఓటువేసే హక్కు లేదు. న్యాయపరమైన విషయాల్లో రాష్ట్రపతికి, మంత్రిమండలికి సలహా ఇస్తారు.

పార్లమెంటు
ఇది ద్వంద్వ సభ. దిగువ సభ (లోక్‌సభ), ఎగువసభ (రాజ్యసభ) ఉంటాయి. రాజ్యాంగ నిబంధనల మేరకు లోక్‌సభలో గరిష్టంగా 552 మంది సభ్యులుండవచ్చు. వీరిలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులు. అయితే ప్రస్తుతం 545 మంది సభ్యులున్నారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2026 వరకు లోక్‌సభ సభ్యుల సంఖ్య యథాతథంగా కొనసాగుతుంది. 1971 జనాభా ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరిగింది. రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. వారిలో 238 మంది వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తే, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. వీరిలో 233 మంది ఎన్నికైనవారు, మిగిలిన వారిని రాష్ట్రపతి నామినేట్ చేశారు. రాజ్యసభ శాశ్వత సభ. సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. వివిధ రాష్ట్ర /కేంద్ర పాలిత శాసనసభ సభ్యుల నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఓటు బదలాయింపు పద్ధతిపై ఎన్నికవుతారు.

ఏటా మూడుసార్లు సమావేశం!
5 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైన లోక్‌సభ గడువుకు ముందే రద్దు కావచ్చు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అయిదు సంవత్సరాల పదవీకాలం ముగిసినా మరో సంవత్సరం (మొత్తం ఆరేళ్లకు) పొడిగిస్తూ పార్లమెంటు చట్టం చేయొచ్చు. అవసరాన్ని బట్టి ప్రతి సంవత్సరం చట్టం ద్వారా పొడిగించవచ్చు. 1976లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక సంవత్సర కాలం పొడిగించారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక ఆర్నెల్ల కంటే ఎక్కువ కాలం లోక్‌సభ కొనసాగకూడదు (అప్పటికే దాని సాధారణ పదవీకాలం పూర్తై). పార్లమెంటు సాధారణంగా ఏటా మూడుసార్లు సమావేశమవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జరిగే ఈ సమావేశాల మధ్య గడవు ఆర్నెల్లకు మించకూడదు. సాధారణ ఎన్నికల తర్వాత ప్రారంభమైన మొదటి లోక్‌సభ సమావేశానికి, ఎన్నికైన వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని లోక్‌సభ తాత్కాలిక స్పీకర్ (ప్రొటెం)గా రాష్ట్రపతి నియమిస్తారు. ఈయన ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ ఎన్నికకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్. డిప్యూటీ చైర్మన్‌ను సభ్యులు ఎన్నుకుంటారు. అలాగే లోక్‌సభ కూడా డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటుంది.

శాసన సంబంధ విధులు
పార్లమెంటు ప్రధానంగా శాసన సంబంధ విధులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లులను ఆమోదించడం, అమల్లో ఉన్న చట్టాలను సవరించడం, రాజ్యాంగ సవరణ బిల్లులను చర్చించి ఆమోదించడం, ప్రజా సమస్యలను చర్చించడం వంటి విధులు నిర్వహిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం ద్వారా ప్రభుత్వాన్ని గద్దెదించే అధికారం లోక్‌సభకు ఉంది. సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభలకు సమాన అధికారాలున్నాయి. ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి ఆర్నెల్ల తర్వాత సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ద్రవ్య, ఆర్థిక బిల్లు ఆమోదం, సవరణ-తిరస్కరణ (బడ్జెట్‌తో సహా) అధికారం లోక్‌సభకు మాత్రమే ఉంది. రాజ్యసభ కేవలం 14 రోజులు మాత్రమే ద్రవ్యబిల్లును నిలిపేయగలదు. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రెండిటికీ సమానాధికారాలున్నాయి. వాయిదా తీర్మానం, అభిశంసన తీర్మానం లోక్‌సభ మాత్రమే చేయగలదు.

రాజ్యసభ ప్రత్యేక అధికారాలు
అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై పార్లమెంటు చట్టం చేయడానికి సంబంధించిన బిల్లు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసిన తర్వాతే పార్లమెంటు పరిశీలిస్తుంది. అలాగే ఉపరాష్ట్రపతిని తొలగించాలన్న ప్రతిపాదన రాజ్యసభ చొరవతోనే మొదలవుతుంది. లోక్‌సభ రద్దయ్యాక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే దాన్ని నిర్ణీత కాలంలో రాజ్యసభ ఆమోదిస్తే చెల్లుబాటవుతుంది. ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభలకు ఉన్నప్పటికీ ఒకే అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు చట్టం చేసేటప్పుడు ఆ రెండింటిమధ్య ఘర్షణ ఏర్పడితే పార్లమెంటు చట్టమే చెల్లుతుంది. అవశేషాంశాలపై చట్టంచేసే అధికారం పార్లమెంటుదే. అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా (రాజ్యసభ ఆ మేరకు 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే) రాష్ట్ర జాబితాలో ఏ అంశంపైనైనా చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనతో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. 356వ ప్రకరణ అమల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి చట్టాలను పార్లమెంటు చేస్తుంది.

స్పీకర్
లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించే స్పీకర్.. హోదాలో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత స్పీకర్‌దే అగ్రస్థానం. సభాపతిగా సభాకార్యక్రమాలు నియంత్రించడంతోపాటు సమన్లు, అరెస్టు వారెంట్లు జారీచేసే అధికారం ఉంది. సంయుక్త సమావేశానికి (లోక్‌సభ, రాజ్యసభ) అధ్యక్షత వహిస్తారు. ఒక బిల్లు ద్రవ్యబిల్లు అనే విషయాన్ని స్పీకర్ నిర్ధారిస్తారు. పార్లమెంటు కమిటీలకు సభ్యులను, అధ్యక్షులను నామినేట్ చేస్తారు. నిబంధనల కమిటీకి, సాధారణ విషయాల కమిటీకి, సభా కార్యక్రమాల కమిటీకి పదవీరీత్యా అధ్యక్షునిగా ఉంటారు.

కమిటీల ద్వారా కార్యకలాపాలు:
పార్లమెంట్ తన ముఖ్య కార్యకలాపాలను కమిటీల ద్వారా నిర్వహిస్తుంది. అవి రెండు రకాలు.. స్థాయీ సంఘాలు, తాత్కాలిక సంఘాలు. స్థాయీ సంఘాలు శాశ్వత ప్రాతిపదికపై పనిచేస్తాయి. ఈ కమిటీలకు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా సభ్యులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన స్థాయీ సంఘాలు.. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల ఖాతాల సంఘం, శాఖాపరమైన స్థాయీసంఘాలు. అంచనాల సంఘంలో ఉండే మొత్తం 30 మంది లోక్‌సభ సభ్యులు. ప్రభుత్వ ఖాతాల సంఘంలో 15 మంది లోక్‌సభకు, ఏడుగురు రాజ్యసభకు చెందుతారు. ప్రభుత్వ ఉపక్రమాల సంఘం స్వరూపం కూడా అలాగే ఉంటుంది. శాఖాపరమైన స్థాయీ సంఘాలు 1993 నుంచి పనిచేస్తున్నాయి. 2004లో వీటి సంఖ్య 17 నుంచి 24కు పెరిగింది. ఒక్కో సంఘంలో ఉండే 31 మంది సభ్యుల్లో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ నుంచి ఎన్నికవుతారు. 16 కమిటీలు లోక్‌సభ స్పీకర్ అజమాయిషీలో పనిచేస్తే మిగిలిన ఎనిమిది రాజ్యసభ చైర్మన్ పర్యవేక్షణలో ఉంటాయి.






















#Tags