Intermediate Practical Exams 2024: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 12,845 మంది ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 70 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ఇంటర్ బోర్డు అధికారులు చకాచకా చేస్తున్నారు. రెండు విడతలుగా ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. తొలివిడత ఈ నెల 11 నుంచి 15 వరకు, రెండో విడత 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. గతంలో ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఆఫ్‌లైన్‌లో మార్కులు వేసి వాటిని బండిళ్లలో భద్రపరిచి బోర్డుకు పంపేవారు. అయితే ప్రప్రథమంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా బోర్డు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పరీక్ష ముగిసిన వెంటనే ఎగ్జామినర్లు అదేరోజు ఆన్‌లైన్ లో మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఎగ్జామినర్లకు పోస్టల్ ద్వారా ఉత్తర్వులు
ఆయా కేంద్రాలకు ఎగ్జామినర్లను బోర్డు అధికారులు నేరుగా నియమించారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేసే వారికి కనీసం రెండేళ్లు, ప్రైవేట్ కళాశాలల్లో పని చేసేవారికి కనీసం మూడేళ్ల అనుభవం అర్హతగా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న కళాశాలల నుంచి అధ్యాపకులను తీసుకున్నారు. ఎవరిని కూడా తను పని చేస్తున్న కళాశాలలో ఎగ్జామినర్‌గా నియమించరు. నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నేరుగా పోస్టల్ ద్వారా పంపనున్నారు. ఎగ్జామినర్లను మూడు రోజులకోసారి మార్చుతారు. ఒకసారి నియమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నియమించరు. ప్రైవేట్ కళాశాలలు కేంద్రాలుగా ఉన్నవాటికి డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించనున్నారు.
Also Read : 2nd Year Study Material(TM)
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
పరీక్షల నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించారు. జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) కన్వీనర్, డీవీఈఓ వెంకటరమణనాయక్‌తో పాటు మెంబర్లు శంకరయ్య (ఆత్మకూరు ప్రిన్సిపాల్), మహమ్మద్ షఫీ (శింగనమల ప్రిన్సిపాల్), జగన్నాథ్ (కళ్యాణదుర్గం ప్రిన్సిపాల్), వెంకటేశ్వర ప్రసాద్ (ఒకేషనల్ జూనియర్ కళాశాల– అనంతపురం ప్రిన్సిపాల్) పర్యవేక్షిస్తారు. ఇద్దరు సభ్యులను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. వీరిలో ఒకరు విద్య, మరొకరు రెవెన్యూ శాఖ నుంచి ఉంటారు. వీరే కాకుండా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీఓలతో పాటు కేంద్రాలున్న ప్రాంతాల తహసీల్దార్లు కూడా పర్యవేక్షిస్తారు.
- ఈ నెల 11 నుంచి ప్రయోగ పరీక్షలు
- జిల్లాలో 70 కేంద్రాల ఏర్పాటు
- హాజరుకానున్న 12,845 మంది విద్యార్థులు
- రెండు విడతలుగా నిర్వహణ
- తొలిసారిగా ప్రాక్టికల్ మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు
ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. విద్యార్థులకు ఎటువంటి సమస్యా ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారిగా పరీక్షలు అయిపోయిన వెంటనే సంబంధిత ఎగ్జామినర్లు మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ల విషయమై ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు రానున్నాయి.