Intermediate Pre Public Exams 2024 : ఇంటర్మీడియెట్ ప్రీ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం
ఇంటర్మీడియెట్ ప్రీ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి మొదలుకానున్న నేపథ్యంలో ఈలోగా ముందస్తుగా ప్రీ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు భావించారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి మొదలయ్యే ప్రీపబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకెండియర్..
ప్రీ పబ్లిక్ పరీక్షలను ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధాన మైన జనరల్ కోర్సుల పరీక్షలు జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత దిద్దుబాటు చేయనున్న మార్కులను సంబంధిత సీఎంఆర్ రికార్డుల్లోను, జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లోను నమోదు చేయనున్నారు.
Also Read : Inter exams schedule in 2024: మరోసారి రివిజన్... వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం!!
ఇంటర్‌బోర్డు ప్రశ్న పత్రంతో..
2022–2023 ఇంటర్ పబ్లిక్ పరీక్షలు గత ఏడాది మార్చి నెలలో, సప్లిమెంటరీ పరీక్షలను జూన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు సెట్ల ప్రశ్న పత్రాల్లో రెండింటిని వినియోగించగా.. ఒక సెట్ మిగిలింది. మిగిలిన ఆ ఒక సెట్ ప్రశ్న పత్రాన్ని ఈ ప్రీపబ్లిక్ పరీక్షలకు వినియోగించాలని ఇంటర్‌విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీ డియెట్ విద్య డీవీఈఓ కోట ప్రకాశరావు, ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నాపత్రాలను కళాశాలలకు చేర్చారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో జూనియర్ కళాశాలలు 191 ఉన్నాయి. అయితే వీటిలో ఫంక్షనింగ్ జరుగుతున్న కళాశాలలు 172 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38, సోషల్ వెల్ఫేర్ 9, ట్రైబల్ వెల్ఫేర్ 1, మోడల్ స్కూల్/కళాశాలలు 13, కేజీబీవీలు 25, జెడ్పీహెచ్ స్కూల్ కాలేజీలు 5, కో ఆపరేటివ్ 2, మిగిలినవన్నీ ప్రైవేటు కళాశాలలే. వీటిల్లో మొత్తం 49,607 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 25258 మంది, ద్వితీయ సంవత్సరం 24349 మంది చదువుతున్నారు. వీరంతా ఈ పరీక్షలను రాయనున్నారు.
పకడ్బందీగా పరీక్షలు జరపాలి
జిల్లాలో నేటి నుంచి మొదలయ్యే ప్రీ పబ్లిక్ పరీక్షలను పక్కాగా పకడ్బందీగా జరిపించేలా ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో అన్ని యాజమాన్యాల జూనియర్ కాలేజీల్లో పరీక్షలు జరగనున్నాయి. స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్న పత్రాలను కళాశాలలకు చేరవేశాం. పరీక్షల తీరుపై కళాశాలల్లో తనిఖీలు చేస్తాం. – ప్రగడ దుర్గారావు, జిల్లా ఆర్‌ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రశ్న పత్రాలను వినియోగిస్తున్నాం
ఇంటర్ ప్రీ పబ్లిక్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉదయం ఫస్టియర్స్‌కు, మధ్యాహ్నం సెకిండియర్ వారికి పరీక్షలు జరుగుతాయి. ఐపీఈ–2023 ఇంటర్‌బోర్డు ప్రశ్న పత్రాల సెట్‌ను వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు తగు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. జవాబుపత్రాలను వెంటనే దిద్దుబాటు చేసి ఈనెలాఖరులోగా మార్కులను జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లో నమోదుచేయాలి. – కోట ప్రకాశరావు, జిల్లా డీవీఈఓ,