DSC 2024: గురువుల కొలువుకు వేళాయె!.. భర్తీ కానున్న 712 ఉపాధ్యాయ పోస్టులు

శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యా య పోస్టులకు సన్నద్ధమౌతున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

 సుమారు 6100 పోస్టులను డీఎస్సీ–2024 ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలపగా.. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 712 పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని మేనేజ్‌మెంట్లవారీగా 712 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు సమాయత్తమౌతున్నారు.

ఇందులో ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీపీ కేటగిరిలో (ఎస్‌జీటీ 341, ఎస్‌ఏ 42, ఎల్‌పీ 42, పీఈటీ 37, మ్యూజిక్‌ 1) కలిపి మొత్తం 527 పోస్టులు, స్పెషల్‌ స్కూల్స్‌లో (ఎస్‌జీటీ 47, ఎస్‌ఏ 13, ఎల్‌పీ 04, పీఈటీ 01) కలిపి మొత్తం 65 పోస్టులు, ట్రైబల్‌ ఏజెన్సీ(ఆశ్రమస్కూల్స్‌)లో (ఎస్‌జీటీ 24, ఎస్‌ఏ 03, ఎల్‌పీ 06, పీఈటీ 02) కలిపి మొత్తం 35 పోస్టులు, ట్రైబల్‌(ఆశ్రమస్కూల్స్‌) నాన్‌ ఏజెన్సీలో (ఎస్‌జీటీ 39, ఎస్‌ఏ 11, ఎల్‌పీ 23, పీఈటీ 12) 85 పోస్టులను భర్తీ చేయనున్నారు.

చదవండి: 6100 AP DSC Jobs 2024 Notification : బ్రేకింగ్ న్యూస్‌.. 6100 పోస్టుల‌కు డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

తొలుత టెట్‌.. తర్వాతే డీఎస్సీ..

మరికొద్ది రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి టెట్‌ను, డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత టెట్‌ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టెట్‌కు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయిస్తామని సర్కార్‌ పేర్కొంది. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే.

#Tags