10th Class Free Study Material: టెన్త్‌ విద్యార్థులకు జగనన్న విద్యాజ్యోతి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో టెన్త్‌ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ పంపిణీకి జిల్లా పరిషత్‌ పాలకవర్గం వరుసగా రెండో ఏడాదీ చర్యలు చేపడుతోంది.

గతేడాది రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, మోడల్‌, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతోపాటు కేజీబీవీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ వరంగా మారనుంది.

ఎంపిక చేసిన సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యాశాఖాధికారుల నుంచి అందుకున్న జెడ్పీ పాలకవర్గం పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెలాఖరులో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయనుంది. దీంతోపాటు గతేడాదిలాగానే ఈ ఏడాదీ జెడ్పీ నిధులతో టెన్త్‌ విద్యార్థులకు స్టడీ అవర్లలో అల్పాహారం పంపిణీ చేయాలని క్రిస్టినా నిర్ణయించారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

రూ.70 లక్షల వ్యయం

గతేడాది రూ.61.80 లక్షల వ్యయంతో 36,155 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో 39వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రూ.70 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. పూర్తిగా జెడ్పీ నిధుల తో తెలుగు, ఇంగ్లిషు మీడియంల వారీగా మెటీరియల్‌ ముద్రణ చేపడుతున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా సూచన మేరకు గుంటూరు డీఈఓ పి.శైలజ సబ్జెక్టు నిపుణులతో మెటీరియల్‌ రూపొందించారు.


సీఎం జగన్‌ నుంచి ప్రశంసలు

చదువుల విప్లవాన్ని తెచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ బాటలోనే గత ఏడాది చేపట్టిన జగనన్న విద్యాజ్యోతి కార్యక్రమం అద్భుత ఫలితాలనిచ్చింది. ఉచిత మెటీరియల్‌ పంపిణీతో టెన్త్‌ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగింది. ఫలితంగా సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాం. పొరుగు జిల్లాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రస్తు తం రెండో దఫా స్టడీ మెటీరియల్‌ ముద్రణకు చర్యలు చేపడుతున్నాం. ఫిబ్రవరిలో అల్పాహారం అందజేతకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
– కత్తెర హెనీ క్రిస్టీనా, జెడ్పీ చైర్‌పర్సన్‌

#Tags