AP 10th Class Supplementary Exam Updates: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి అలర్ట్‌.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన వారికి మరో అవకాశం కల్పిస్తూ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. నేటి(మంగళవారం) నుంచి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఎగ్జామ్స్‌కు నామమాత్రపు ఫీజును నేటి నుంచి ఈ నెల 30లోపు స్కూళ్ల లాగిన్‌ ద్వారా చెల్లించాలి. రూ. 50 అపరాధ రుసుముతో మే 23 వరకు చెల్లించవచ్చు. అలాగే ఒక్కో పేపర్‌ రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు రూ. 1000 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులకైనా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌‌ కోసం కోరవచ్చు.

ఈ ఏడాది మొత్తం ఎంతమంది పరీక్ష రాశారంటే..

కాగా మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. 

ఫలితాల్లో ఓవరాల్‌ పాస్‌ పర్సంటేజ్‌ 86.69%గా ఉంది. 69.26శాతం మంది విద్యార్థులు ఫస్ట్‌ క్లాస్‌లోనే పాసయ్యారు. 2300 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 17 స్కూళ్లలో ఒక్కరూ పాస్‌ కాకపోవడం గమనార్హం.

#Tags