TTC Course: ఈనెల 25లోగా టీటీసీ కోర్సులకు దరఖాస్తులు..
అనంతపురం: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) 42 రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 11 వరకు శిక్షణ జరుగుతుంది. ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించమని స్పష్టం చేశారు.
అర్హులు వీరే..
అభ్యర్థులకు ఈ ఏడాది మే 1 నాటికి 18 సంవత్సరాలు నిండి, 45 సంవత్సరాలలోపు వయసు ఉండాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, తప్పనిసరిగా టీసీసీ లోయర్ కూడా పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు, ఇంటర్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ కలిగిన వారు, టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అర్హత ఉంటుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్నా, ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్‌మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికెట్ కలిగి ఉన్నా, తెలుగు విశ్వ విద్యాలయం వారు జారీ చేసిన కర్నాటిక్ మ్యూజిక్ (వోకల్, వీణ, వయొలిన్)లలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉన్నా, ఏదైనా విశ్వ విద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉన్నా అర్హులని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌కాపీలను అనంతపురంలోని పాత డీఈఓ కార్యాలయం (పరీక్షల విభాగం)లో అందజేయాలని డీఈఓ సూచించారు. జిల్లాలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.