Four Year Degree Holders Can Directly Pursue PhD: నాలుగేళ్ల డిగ్రీతో ఇకపై నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు.. యూజీసీ కొత్త గైడ్‌లైన్స్‌

పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీతో విద్యార్థులు ఇకపై నేరుగా యూజీసీ నెట్‌ పరీక్ష రాయొచ్చని, తద్వారా వారు పీహెచ్‌డీ చేయొచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తెలిపింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ఉన్నా లేకపోయినా పీహెచ్‌డీ చేసేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ ఉంటే చాలని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఇప్పటివరకు వాళ్లకు మాత్రమే ఆ ఛాన్స్‌
ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులు/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5 శాతం మార్కుల్లో సడలింపు ఉంటుందన్నారు. ఇప్పటివరకు మాస్టర్స్  డిగ్రీ పూర్తి చేసి 55 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులను మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు.

అయితే తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్‌డీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ ఛైర్మన్ తెలిపారు.

నెట్‌ సెషన్‌లో కొత్త విధానం..
ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. యూజీసీ నెట్‌ సెషన్‌ పరీక్షలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, యూజీసీ నెట్ (జూన్) సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 10వ తేదీలోగా ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, 12వ తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని యూజీసీ పేర్కొంది. 

#Tags