Skip to main content

Results: ఫలితాల సాధనకు ప్రణాళిక

● 100 రోజుల ప్రణాళికతో ప్రత్యేక కార్యాచరణ
results
results

భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఫలితాలు రావడమే కాకుండా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచడం, తద్వారా ఉన్నత విద్యలో రాణించేందుకు వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ తయారుచేస్తున్నారు.

‘కే 12’ సహకారంతో..

గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల పర్యటన సందర్భంగా విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని పీఓ గ్రహించారు. వారు చదువులో బేసిక్‌ లెవల్స్‌ కనుగొనేలా హైదరాబాద్‌కు చెందిన కే12 యాక్టివిటీ అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రతి పాఠశాలలో నేషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఐటీడీఏ పరిధిలో గల 285 పాఠశాలల్లో 12,859 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, బేసిక్‌ లెవెల్స్‌ తక్కువ స్థాయిలో ఉన్నాయని తేలడంతో వారి కోసం ప్రత్యేక సావనీర్‌ సిద్ధం చేశారు. రీడింగ్‌, రైటింగ్‌, టీచింగ్‌ పేరుతో ఇప్పటికే ఈ శిక్షణ ప్రారంభమైంది. విద్యార్థులకు వర్క్‌బుక్‌లు, డిక్షనరీలు, ఇతర మెటీరియల్‌ అందజేశారు. దీంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఇన్‌ ఏ డే’ పేరిట వినూత్న కార్యక్రమం నడుస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కేటగిరీలుగా విద్యార్థులను విభజించి వారికి తర్ఫీదు ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో రోజుకో కొత్త పదం నేర్పి, దానిపై రోజంతా అవగాహన కల్పిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీలో చదవడం, గ్రామర్‌ నేర్పిస్తున్నారు.

ఏజెన్సీ డీఈఓ పోస్టు భర్తీతో

మరింత న్యాయం..

ప్రస్తుతం గిరిజన గురుకులాలను ఇన్‌చార్జ్‌ ఆర్‌సీఓలు, ఆశ్రమ పాఠశాలలను ఇన్‌చార్జ్‌ డీడీలు పర్యవేక్షిస్తున్నారు. వీరికి ఇతర బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో విద్యాసంస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టును జిల్లా విద్యాశాఖాధికారిగా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ డీఈఓ పోస్టు రద్దయింది. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఏజెన్సీ డీఈఓ ఉంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. గిరిజన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పీఓ ఈ సమస్యపైనా దృష్టి సారించాలని గిరిజన, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉత్తమ ఫలితాల సాధనకు ప్రణాళిక

గిరిజన విద్యార్థులు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌, డీడీ మణెమ్మ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించాం. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.– రమణయ్య, ఏసీఎంఓ

వంద రోజుల ప్రణాళికతో..

గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకు పీఓ ప్రతీక్‌ జైన్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ చివరి వరకు సిలబస్‌ పూర్తి చేసి, జనవరి నుంచి పరీక్షల ప్రిపరేషన్‌ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. సిలబస్‌ పూర్తయిన తర్వాత విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి, వారి స్థాయికి తగ్గట్టుగా ప్రిపరేషన్‌ కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. గణితం, సోషల్‌ సబ్జెక్టులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో మెటీరియల్‌ సిద్ధం చేస్తున్నారు.

Published date : 05 Oct 2023 09:43PM

Photo Stories