Skip to main content

Andhra Pradesh: మూడు పరిశ్రమలు.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు

Job Opportunities in Andhra Pradesh

తిరుపతి అర్బన్‌ : జిల్లాలో కొత్తగా శ్రీకారం చుట్టిన మూడు పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లె క్యాంపు కార్యాలయం నుంచి నూతన ఫ్యాక్టరీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవం, భూమి పూజ చేశారు. తిరుపతి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మేయర్‌ శిరీష, జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్‌రెడ్డి, ఉద్యానశాఖాధికారి దశరథరామిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నాయుడుపేట ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 66.49 ఎకరాల విస్తీర్ణంలో రూ. 825 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ ల్యామ్‌ సౌత్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. ఈ కంపెనీతో సుమారు 1,050 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే రూ.325 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన డీపీ చాక్లెట్‌ (కోకోవా) యూనిట్‌ ద్వారా 250 మందికి ఉపాధి లభించనున్నట్లు వివరించారు. దీంతో 18 వేల మంది రైతులకు మేలు చేకూరుతుందని, సంవత్సరానికి 40 వేల మెట్రిక్‌ టన్నుల కోకోవా ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మరోవైపు రూ.4.46 కోట్ల పెట్టుబడితో ఓజిలి మండలం వాకాటి కండ్రిగ వద్ద ఏర్పాటు చేయనున్న సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారన్నారు. ఈ మూడు పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రీన్‌ లామ్‌ ప్రతినిధులు కృష్ణ మోహన్‌, రాధాకృష్ణ, శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద రావు, ఏపీఐఐసీ నాయుడుపేట స్పెషల్‌ జోన్‌ జెడ్‌ఎం చంద్రశేఖరయ్య, సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని, చాక్లెట్‌ పరిశ్రమ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Mini Job Mela: 6న మినీ జాబ్‌ మేళా

75శాతం స్థానికులే అవకాశం: డీపీ చాక్లెట్‌ పరిశ్రమ చైర్మన్‌
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం వద్ద డీపీ చాక్లెట్‌ కోకోవ రెండో యూనిట్‌లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించనున్నట్లు పరిశ్రమ చైర్మన్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 650 మందికి పైగా ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. అలాగే ఏడాదికి 40వేల మెట్రిక్‌ టన్నుల చాక్లెట్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు ఉపయోగపడేలా ఆహార పదార్థాల తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించనట్లు తెలిపారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. ఆర్డీఓ చంద్రముని, పరిశ్రమ డైరెక్టర్‌ మాధురి, తహసీల్దార్‌ గౌరీశంకరరావు, మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, పార్టీ మండల కన్వీనర్‌ దయాకర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బందిల సురేష్‌, వైస్‌ ఎంపీపీ పద్మావతి, సర్పంచులు శ్రీధర్‌ రెడ్డి, జ్యోతి, శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టు బోర్డు మెంబర్‌ పెద్దిరెడ్డి మల్లికార్జునరెడ్డి, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శంకర్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌ సురేష్‌ పాల్గొన్నారు.
 

Published date : 05 Oct 2023 04:47PM

Photo Stories