software jobs : సాఫ్ట్‌వేర్ కొలువు.. ఇక చాలా సులువు!
నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్‌టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు.
అమల్లోకి ఆర్–22
ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి.
అన్ని బ్రాంచ్‌లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు
ఇంజనీరింగ్‌లో సీఎస్‌సీ ఓ క్రేజ్‌గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్‌తో), క్లౌడ్ డెవలప్స్, ఆరి్టఫీíÙయల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్‌టీయూహెచ్ వీలు కలి్పస్తుంది.
ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్‌లైన్‌లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది.
ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ
నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్‌గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్‌ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం.