APPSC group1 group2 Job for youth: యువతలో ఉద్యోగాల జోష్
రాష్ట్రంలోని యువతలో ఉద్యోగాల జోష్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూపు–1, గ్రూప్–2 నోటి ఫికేషన్‌లు విడుదల చేసింది. తాజాగా ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించింది.
వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల ఖాళీలను భర్తీచేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు వేల మంది ఉద్యోగాలు పొందారు. వైద్యశాఖలో నిరంతరం నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.
ఏదో ఒక పోస్టును సొంతం చేసుకునేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర యువత ఉద్యోగాలు కొట్టేందుకు పట్టుదలగా కృషి చేస్తున్నారు.
నోటిఫికేషన్ల జోరు
ఒకప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లు రెండు మూడేళ్ల కోసారి విడుదలయ్యేవి. ఒకసారి శిక్షణ పొందిన అభ్యర్థి ఆ నోటిఫికేషన్‌లో ఉద్యోగం రాకుంటే, మరో మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది. దీంతో శిక్షణ పొందిన సిలబస్ మర్చిపోయేవారు. ప్రస్తుత ప్రభుత్వం వెంట వెంటనే నోటిఫికేషన్‌లు విడుదల చేయడం తమకు ఎంతో మేలు కలుగుతోందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. తాజాగా గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పంచాయతీ సెక్రటరీ, ఎస్‌ఐ ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా మెగా డీఎస్సీతో 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రామీణ విద్యార్థుల్లోనూ ఆసక్తి
ఒకప్పుడు పట్టణాల్లో ఉండేవారే గ్రూపులకు శిక్షణ తీసుకుని ఉద్యోగాలు ఎక్కువగా పొందేవారు. ఇప్పుడు మట్టిలో మాణిక్యాల్లా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సివిల్స్, గ్రూప్స్‌తో పాటు, ఇతర ఉద్యోగాల్లో ముందుంటున్నారు.
పట్టణాలకు వచ్చి శిక్షణ పొందేవారు కొందరైతే, టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్‌లైన్ శిక్షణ పొందుతున్న వారు మరి కొందరు. అంతిమంగా ఉద్యోగ సాధనే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. పట్టణ విద్యార్థుల కంటే గ్రామీణ విద్యార్థులే ముందుంటున్నారని పలువురు చెపుతున్నారు.
శిక్షణ సంస్థలకు డిమాండ్
ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో శిక్షణ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు గ్రూప్స్ శిక్షణకు హైదరాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు విజయవాడలోనే ఐఏఎస్, గ్రూప్స్‌కు శిక్షణ ఇచ్చే సంస్థలు వెలిశాయి. అవి ఆన్‌లైన్‌లో కూడా శిక్షణ ఇస్తున్నాయి.
దీంతో కొందరు ఇంటి వద్దనే ఉండి ఆన్ లైన్‌లో శిక్షణ పొందుతుండగా, మరికొందరు నగరానికి వచ్చి, హాస్టల్స్‌లో ఉంటూ శిక్షణ పొందుతు న్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు డిమాండ్ పెరిగింది.
గ్రూప్–1, గ్రూప్–2, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు వైద్యశాఖలో నిరంతరాయంగా ఖాళీ పోస్టుల భర్తీ ఉద్యోగమే లక్ష్యం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు
సరైన ప్రిపరేషన్ అవసరం
గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ నోటిఫికేషన్లకు సరైన ప్రిపరేషన్‌తో ఉద్యోగం సాధించొచ్చు. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీపై ఎక్కువగా అధ్యయనం చేసిన వాళ్లు మంచి మార్కులు సాధించొచ్చు.
గ్రూప్–1 మెయిన్స్‌లో ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరైతే చేశారో వారు ఎక్కువ మార్కులు సాధిస్తారు. గ్రూప్–2లో కొత్తగా ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. డీఎస్సీలో ఎన్సీఈఆర్టీలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.