Skip to main content

CM YS Jagan Mohan Reddy: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

Revolutionary reforms in the field of education

బాపట్ల అర్బన్‌: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉపాధ్యాయులు అందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోన రఘుపతి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పెదనందిపాడు రోడ్డులోని ఎం.ఎస్‌.ఆర్‌ కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేశారు. ఎమ్మెల్యే కోన మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతిలోనే సమాజ భవిష్యత్‌ ఉందని చెప్పారు. సీఎం ఉన్నత ఆశయాలను అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. విద్యా రంగానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరమని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా రంగానికి జీవం వైఎస్‌ జగన్‌ పోశారని, కార్పొరేట్‌ స్కూళ్లకి ధీటుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వై.ఎస్‌.జగన్‌దేనన్నారు. విద్యార్థులను సరైన రీతిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే నన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైనదని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె.రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని, ఉపాధ్యాయులు సానుకూల దృక్పథంతో శ్రమించి సత్ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన 14 మంది ఉపాధ్యాయులు, అలాగే సెంటా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్ష లో జిల్లా స్థాయి విజేతలు ఐదుగురిని ప్రశంసా పత్రం, మెమెంటో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారులు ఆర్‌.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్‌ అధికారి సాదిక్‌ మహమ్మద్‌ పాల్గొన్నారు.

చ‌ద‌వండి: CM YS Jagan Mohan Reddy: విద్యారంగానికి సీఎం జగన్‌ పెద్దపీట

బాపట్ల ఇంజినీరింగ్‌లో..
బాపట్ల అర్బన్‌: బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్స్‌ ఆధ్వర్యంలో టీచర్స్‌ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఓ నజీర్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కృషి, దీక్ష, పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల డీన్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ డి.నిరంజన్‌ బాబు మాట్లాడుతూ శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అని చెప్పారు. అందుకే పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవగా పేర్కొన్నారు. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఎమ్మెల్యే కోన రఘుపతి ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం 19 మంది టీచర్లకు అవార్డుల ప్రదానం

Published date : 06 Sep 2023 06:14PM

Photo Stories