Govt Schools: సర్కారు బడులకుకొత్త పాత్రలు
విజయనగరం అర్బన్/రామభద్రపురం: సర్కారు బడుల్లో వంటలు చేసే మధ్యాహ్నభోజన నిర్వాహకులకు శుభవార్త. అరకొర పాతపాత్రలతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఇక ఉండదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా భోజనాలు వండి వడ్డించేందుకు అవసరమైన కొత్తపాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. సిల్వర్ పాత్రల స్థానంలో నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌పాత్రలను సమకూర్చుతోంది. జగనన్నగోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డిస్తోంది. మెనూలో రాగిజావను చేర్చింది. వీటిని తయారు చేసేందుకు అవసరమైన పాత్రలను సైతం సమకూర్చుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పాత్రలు చేరాయి. ఎంఈఓల ఆధ్వర్యంలో వాటిని భద్రపరిచారు. అక్కడి నుంచి పాత్రలను ప్రజాపంపిణీ వ్యవస్థల వాహనాల ద్వారా పాఠశాలకు తరలిస్తున్నారు.
తీరనున్న వంట పాత్రల సమస్య..
నిత్యం మధ్యాహ్న భోజనం వండివార్చే ఏజెన్సీలకు వంట పాత్రల సమస్య వేధిస్తోంది. 2010లో అప్పటి ప్రభుత్వం వంట ఏజెన్సీలకు పాత్రలను సరఫరా చేసింది. అప్పటి నుంచి వాటినే ఉపయోగిస్తుండడంతో పాడైపోయిన వాటితో వంటలు చేసేందుకు నిర్వాహకులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా మార్చేశారు. నాడు–నేడు పథకంతో వసతులు కల్పించారు. ఆంగ్లమాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. చక్కని బోధన ప్రణాళికను అమలుచేస్తుండడంతో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నభోజనం వండిపెట్టే ఏజెన్సీలకు వంట పాత్రల సమస్య ఎదురైంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి కొత్త పాత్రల పంపిణీ చేపట్టింది.
జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలోని 1751 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలను ఆరు కేటగిరీలుగా విద్యాశాఖ అధికారులు విభజించారు. 30 లోపు విద్యార్థులున్న పాఠశాలలు ఎ–కేటగిరీ, 31 నుంచి 50 వరకు ఉంటే–బి, 51 నుంచి 150 మధ్య ఉంటే–సి, 151–250 మధ్య–డి, 251–400 మధ్య–ఇ, 400 అంత కంటే ఎక్కువ ఉంటే ఎఫ్ కేటగిరీలుగా పాఠశాలలను విభజించారు. ఏ,బీ కేటగిరీలకు 5, సీ,డీ,ఈ కేటగిరీలకు 6, ఈ, ఎఫ్ కేటగిరీలకు 11 చొప్పున పెద్ద పాత్రలు, బేసిన్లు, కురిపి, హస్తాలు, వడ్డించేందుకు అవసరమైన స్టీలు పాత్రలు అందజేస్తున్నారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శుభవార్త పాత్రల సమస్యను తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం సిల్వర్ పాత్రల స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల సరఫరా విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 నుంచి 11 రకాల సామగ్రి 1751 స్కూళ్లకు మండల కేంద్రాల నుంచి సరఫరా నాణ్యమైన పాత్రల సరఫరా
మధ్యాహ్న భోజనం తయారీకి, వడ్డించేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్టీల్ పాత్రలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాత్రలు చాన్నాళ్ల కిందటి నాటివి. వాటిలో వండేందుకు భోజన నిర్వాహకులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లోని పాత్రలు పూర్తిగా పాడయ్యాయి. అదే సమయంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వంట పాత్రలు అదనంగా అవసరమవుతున్నాయి. ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో కొనుగోలుచేసిన కొత్త పాత్రలు ఇప్పటికే మండల కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి స్కూళ్లకు సరఫరా చేస్తున్నాం.
– బి.లింగేశ్వరరెడ్డి, డీఈఓ, విజయనగరం