Govt Medical College: వైద్య విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
ఒంగోలు టౌన్: ఎంతో కష్టపడి చదివి, ఇంకెంతో ఇష్టపడి మెడికల్ సీటు సాధించిన వైద్య విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఒంగోలు డీఎస్పీ వి.నారాయణస్వామిరెడ్డి హితవు పలికారు. గురువారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2023 బ్యాచ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు రావడం ఎంతో అదృష్టమని, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని శ్రద్ధగా చదివి తలిదండ్రులు, గురువులు, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఇటీవల కాలేజీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థుల మీద కూడా ఉందన్నారు. జులాయిలు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడాన్ని అర్థం చేసుకోవచ్చని, కానీ రేపటి డాక్టర్లుగా గౌరవాన్ని పొందాల్సిన వైద్య విద్యార్థులు ఘర్షణపడి పోలీసుల చుట్టూ తిరగడం సబబుగా లేదన్నారు. కోరి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని, మంచి వైద్యులుగా ఎదిగి సమాజం నుంచి మన్ననలు, ప్రజల నుంచి ఆదరణ పొందాలని హితబోధ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు మెడిసిన్ చదువుతున్నారని తలిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. అనంతరం.. తాత్కాలిక సంతోషాల కోసం చెడుమార్గంలో నడవబోమని, తలిదండ్రులకు తలవంపులు తీసుకురామని, క్రమశిక్షణతో చదువుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణ, వార్డెన్ డాక్టర్ జి.సుధాకర్ పాల్గొన్నారు.
డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి
చదవండి: Staff Nurse Jobs Counseling: స్టాఫ్ నర్సు పోస్టులకు కౌన్సెలింగ్