Skill Colleges: పేద విద్యార్థులకు వరం.. స్కిల్ కళాశాల
నరసాపురం రూరల్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఆర్థిక స్వావలంభనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సముద్ర తీర ప్రాంతంలోని పెదమైనవానిలంక గ్రామంలో స్కిల్ కాలేజిని ఏర్పాటు చేసింది. భారత దేశానికి మారుమూల నరసాపురం నియోజకవర్గంలోని పెదమైనవాని లంక కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం. గ్రామీణ ప్రాంతంలోని యువత కోసం స్కిల్ కశాశాలను ఆమె నిధులతో నిర్మించిన బహుళార్ధ సాధక సామాజిక భవనంలో ఏర్పాటు చేశారు. స్కిల్ కాలేజిలో ఆక్వా ల్యాబ్ టెక్నీషియన్, ఫోర్‌మెన్ ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ కేవలం పురుషులకు మాత్రమే కాగా, ఆక్వా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో సీ్త్ర, పురుషులిద్దరికీ అవకాశం ఉంది. ఇంటర్, ఐటీఐ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారికి ఇక్కడ శిక్షణ పొందే అవకాశముంది. యూనిఫాం, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి, భోజన వసతి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా ఇక్కడ శిక్షణ పొందే అవకాశముంది. నాక్ (నేషనల్ అకాడమిక్ ఆఫ్ కనస్ట్రక్షన్) సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తరువాత ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు నెలల కాల వ్యవధిలో ఆక్వా ల్యాబ్ కోర్సుకు 30 సీట్లు, ఐదు నెలల కాల వ్యవధి కలిగిన ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్ వర్కుకు 30 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తికావడంతోపాటు వారిలో 90శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. స్కిల్ సెంటర్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కేంద్ర మంత్రి పలు పర్యాయాలు మాట్లాడారు. ఆయన ప్రోద్బలంతో ఎట్టకేలకు స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకుని విద్యార్థులు నైపుణ్యతతో బయటకు వస్తున్నారు.
చదవండి: Study Abroad: విదేశాల్లో చదువుపై ట్రిపుల్ ఐటీతో ఒప్పందం
ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు నేర్చుకోవాలన్నది నా చిరకాల కోరిక. స్కిల్ కళాశాల వల్ల ప్రభుత్వ కళాశాలలో నైపుణ్యాన్ని పొందే అవకాశం దక్కింది. శిక్షణ బాగుంది. శిక్షణ అనంతరం మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాను.
– కె ప్రసన్న, రాచర్ల, ఆక్వా టెక్నీషియన్ విద్యార్ధి
శిక్షణ ఏర్పాట్లు బాగున్నాయి
నరసాపురం మండలం పెదమైనవానిలంకలో నేను విద్యార్థిగా చేరి ఫోర్‌మెన్ ఎలక్ట్రికల్ వర్కులో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన నేను ఇలాంటి శిక్షణను పొంది స్కిల్ సెంటర్‌ద్వారా నేర్చుకోవడం ఆనందంగా ఉంది.
– బొమ్మిడి తేజోఫణి, నరసాపురం, ఎలక్ట్రికల్ విద్యార్థి
ఖర్చు లేకుండానే మంచి శిక్షణ
ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ అవ్వాలనేది నా చిన్ననాటి కల. స్కిల్‌సెంటర్ ద్వారా నా లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐటీఐ చేసిన నాకు ఈ రంగంలో ఉత్తమ శిక్షణ పొందే అవకాశం దక్కింది.
– అల్లాడి కిరణ్‌బాబు, వరిగేడు, ఎలక్ట్రికల్ విద్యార్థి
చదువుతో పాటు సౌకర్యాలు
స్కిల్ కళాశాల ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల కోర్సు నేర్చుకోగలుగుతున్నాను. దూర ప్రాంతమైతే తల్లిదండ్రులు పంపించే వారు కాదు. నరసాపురం పెదమైన వానిలంకలో ఈ కళాశాల ఉండటం ద్వారా మా భవిష్యత్తుకు మంచి దారి దొరికింది.
– కొప్పాడ గిరిజ, గొల్లపాలెం, ఆక్వా టెక్నీషియన్ విద్యార్థి
చదవండి: Poor Children: ఏపీ విద్యా సంస్కరణలు పేద పిల్లలకు వరం