Gurukul Degree College: ‘గురుకుల డిగ్రీ’.. ప్రారంభం కానట్టే!
సాక్షి, కామారెడ్డి: బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యనందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాకో మహాత్మా జ్యోతీబా పూలే గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరంనుంచే తరగతులు ప్రారంభించాల ని నిర్ణయించింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం అధికారులు భవనాల గురించి వెదికారు. కళాశాలకు సరిపడా సౌకర్యాలు ఉన్న భవనం ఇప్పటికీ దొరకలేదు. దీంతో కాలేజీ ఏర్పాటు కాగితాలకే పరిమితమైది. కాగా కాలేజీ మంజూ రు నాటికే డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. దోస్త్ గడువు ముగిసే సమయంలో గురుకుల డిగ్రీ కాలేజీ మంజూరైంది. దీనికి తోడు దరఖాస్తుల స్వీకరణకు పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. అప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ సీట్ల కేటాయింపు కూడా జరగడంతో కొత్తగా మంజూరైన గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదు. ఏడుగురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఈసారి కాలేజీని ప్రారంభించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిని ఇతర జిల్లాలలో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భవనాల సమస్య..
ప్రభుత్వం బీసీ వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. అయితే భవనాలు మంజూరు చేయకపోవడం సమస్యగా మారింది. ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు అద్దె భవనాలలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. కొత్తగా మంజూరైన డిగ్రీ కాలేజీకి కూడా భవనం దొరకడం లేదు. ప్రభుత్వం భవనాలను మంజూరు చేయాలని విద్యాభిమానులు కోరుతున్నారు.