Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్..!
ఈ బడ్జెట్‌లో సాధారణ పౌరుల నుంచి వ్యాపార వర్గాలు ఎలాంటి మినహాయింపులు ఉండబోతాయని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా రాకతో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారం ఉద్యోగులదే..!
కరోనా మహమ్మారి రాకతో.. కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు అమాంతం తగ్గింది. కంపెనీలు ఆయా ఖర్చులను తగ్గించుకున్నా ఆ భారం పూర్తిగా ఉద్యోగుల మీద పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు ఆయా ఖర్చును భరించినా..మిగతా కంపెనీలు ఆయా ఖర్చులను ఉద్యోగులకే వదిలేశాయి. ఇదే కాకుండా ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగులను ఎక్కువ పని గంటలు పనిచేస్తూన్నాయనే వార్తలు కోకోల్లలుగా వినిపించాయి. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు ప్రయోజన కల్పించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోని బడ్జెట్-2022లో కేంద్రం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరో రూ.50 వేలు..
ఉద్యోగులు ఆఫీసు నుంచి కాకుండా ఇంటి నుంచి పని చేయడం వల్ల కరెంటు బిల్లు మొదలు టీ, స్నాక్స్ వంటి ఆఫీసులు కల్పించే అనేక సౌకర్యాలను ఉద్యోగులు సొంతంగా సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం తమ శాలరీ నుంచి ఖర్చు చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వలన ఉద్యోగులకు పెరిగిన ఆర్థిక భారాన్ని పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వాలంటున్నారు. ఇందుకు అనువుగా ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌కి అదనపు డిడక్షన్‌ను ఉద్యోగులు కోరుకుంటున్నట్లు సమాచారం. గతంలో అడిషినల్ డిడక‌్షన్ విధానం ఉద్యోగులకు అందుబాటులో ఉండేది.
2018లోనే ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. అనేక మంది ఉద్యోగులు స్టాండర్డ్ డిడక‌్షన్‌ని ఎంచుకున్నారు. అయితే స్టాండర్డ్ డిడక‌్షన్‌లో ఉన్న వారికి అడిషనల్ డిడక‌్షన్ లభించడం లేదు. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితినైనా పెంచాల్సి ఉంది లేదంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్‌నైనా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపు విధానంలో మరింత సౌలభ్యం కల్పించాలంటున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ కోసం..
తాజాగా డెలాయిట్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అలవెన్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఇదే డిమాండ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రీ బడ్జెట్ మోమెరాండంలో తెలిపింది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరిస్తే, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు రూ. 50,000 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను పొందవచ్చు.