Skip to main content

విద్యార్థులు, టీచర్లకు ఇన్నోవేషన్ శిక్షణ

సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా, సమస్య పరిష్కారాన్ని సూచించే ఆలోచనను పెంచేలా విద్యా బోధన జరగాలని ప్రభుత్వం ఆశిస్తోందని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులు తమ మేధాశక్తి, సామర్థ్యాలను సందర్భోచితంగా వినియోగించుకునే విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్, యునిసెఫ్ ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్ చాలెంజ్’కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆగస్టు 28న మంత్రి తన కార్యాలయంలో విడుదల చేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. టీచర్లు తమ పాఠశాల విద్యార్థులందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ దేవసేన పాల్గొన్నారు.
Published date : 29 Aug 2020 03:27PM

Photo Stories