Skip to main content

త్వరలో విశాఖలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ వర్సిటీ: సీఎం వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: ద్వితీయ శ్రేణి (టైర్-2) నగరాల్లో నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్ కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

టైర్-1 నగరాల్లో అయితే నిపుణుల కొరత అనే అంశం ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్-2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలని చెప్పారాయన. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఐటీ విభాగం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.3,000 కోట్ల విలువైన ఐటీ సేవలను వినియోగించుకుంటోంది. ఇదంతా ఐటీ విభాగం ద్వారానే జరుగుతోంది. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఐటీ విభాగం ఉండటం వల్ల విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ సమస్య ఉండదు. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యుత్తమమైన మానవ వనరులను తయారు చేసుకునే అవకాశం వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలి.
  • ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా, వారిలో నైపుణ్యాన్ని పెంచేలా చూడాలి.
  • తద్వారా ఐటీ కంపెనీలకు తగినట్టుగా మానవ వనరులు సిద్ధం కావాలి.
  • ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలి.
  • అక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించాలి. ఆ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి.
  • ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలి.
Published date : 04 Nov 2020 03:46PM

Photo Stories