టీఎస్ పాలిసెట్‌తోనే బాసర ట్రిపుల్‌ఐటీ– 2021 ప్రవేశాలు
Sakshi Education
భైంసా: యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారిగా పాలిసెట్‌తోనే బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నిర్మల్ జిల్లా బాసరలో 2008లో ట్రిపుల్ ఐటీ ఏర్పడగా..ఇప్పటివరకు పదో తరగతి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి ఉత్తీర్ణత శాతం ఆధారంగా ప్రవేశం కల్పించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లేకుండానే ఉత్తీర్ణులను చేస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు పాలిసెట్ రాయడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ ఐటీలో 4+2 ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసేందుకు సీటు దక్కాలంటే పాలిసెట్ రాయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేయగా..ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయించారు. రూ.100 అపరాధ రుసుంతో ఈ నెల 27 వరకు, రూ.300 అపరాధ రుసుంతో 30వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. పరీక్ష రాసిన తర్వాత 12 రోజులకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఉత్తీర్ణులైన వారికి ప్రతిభ ఆధారంగా బాసరలోని ట్రిపుల్‌ఐటీతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు పాలిటెక్నిక్ కోర్సులు అందిస్తున్న అన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందవచ్చు.
తెలంగాణ పాలిసెట్– 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ పాలిసెట్– 2021 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 18 Jun 2021 01:55PM