Skip to main content

జేఈఈ మెయిన్ ఫిబ్రవరి 2021 ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే..

సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పేపర్‌–1 పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి.
ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం నిర్వహించిన తొలివిడత పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు చేయగా 6,20,978 మంది హాజరైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అభ్యర్థుల స్కోర్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది నుంచి జేఈఈని నాలుగు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులవారీగా కేవలం స్కోర్‌ను మాత్రమే విడుదల చేసింది. మొత్తం నాలుగు విడతల పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన బెస్ట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించనుంది. ఫిబ్రవరి సెషన్లో 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆరుగురున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికీ100 స్కోర్‌ రాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞసాయి 99.999 స్కోర్‌ సాధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఏపీకే చెందిన మరో ఆరుగురు అభ్యర్థులు తక్కిన కేటగిరీల్లో అత్యధిక స్కోర్‌ సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాల్లో నిలిచారు. ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీలో అనుముల వెంకట జయచైతన్య 99.9961682, గుర్రం హరిచరణ్‌ 99.9942523 స్కోర్లు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఓబీసీ కేటగిరీలో 99.9913217 స్కోర్‌తో బిత్రసాయి సిద్ధి రఘురామ్‌ శరణ్‌ రెండో స్థానం, 99.9846474 స్కోర్‌తో గొట్టిపల్లి శ్రీ విష్ణు సాత్విక్‌ నాలుగో స్థానం దక్కించుకున్నారు. దివ్యాంగుల కేటగిరీలో ఇద్దరికి 3, 4 స్థానాలు లభించాయి. మల్లిన శ్రీ ప్రణవ్‌ శేషుకు 99.6393686, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణకు 99.6363357 స్కోర్లు దక్కాయి.

జాతీయ స్థాయిలో 100 ఎన్టీఏ స్కోర్‌ సాధించిన వారు వీరే..
సాకేత్‌ ఝా (రాజస్థాన్)
ప్రవార్‌ కటారియా (ఢిల్లీ)
రంజిమ్‌ ప్రబాల్‌దాస్‌ (ఢిల్లీ)
గుర్మీత్‌ సింగ్‌ (చండీగఢ్‌)
సిద్ధాంత్‌ ముఖర్జీ (మహారాష్ట్ర)
అనంత కృష్ణ కిదాంబి (గుజరాత్‌)


తెలంగాణలో ఫలితాలు ఇలా..
అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వెనుకబడ్డారు. ఎప్పుడూ 100 పర్సెంటైల్‌ స్కోర్‌ సాధిం చే రాష్ట్ర విద్యార్థులు.. జేఈఈ ఫిబ్రవరి సెషన్లో 100 పర్సెంటైల్‌ సాధించలేకపోయారు. రాష్ట్రాల వారీ, కేటగిరీల వారీ ఉన్న 41 మంది టాపర్స్‌లో రాష్ట్ర విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. అందులో చల్లా విశ్వనాథ్‌ 100 పర్సెంటైల్‌కు 99.9990421, కొమ్మ శరణ్య 99.9990421 పర్సెంటైల్‌ సాధించారు. అత్యధిక మార్కులు 300కు 290 మార్కులు రాష్ట్ర విద్యార్థులకు లభించాయి. కాగా, సోమవారం ఉదయమే వస్తాయనుకున్న జేఈఈ మెయిన్ ఫలితాలను ఎట్టకేలకు రాత్రికి విడుదల చేశారు. జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో (jeemain.nta. nic.in) ఫలితాల లింకులు అందుబాటులోకి తెచ్చారు.

ప్రశ్నల్లో తప్పులతో గందరగోళం..
గత నెలలో నిర్వహించిన మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఇచ్చిన చాయిస్‌ ప్రశ్నల్లో దొర్లిన తప్పులు ఫలితాల వెల్లడిలో ప్రతిష్టంభనకు కారణమయ్యాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో (న్యూమరికల్‌ వాల్యూ విభాగంలో) గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రతి çసబ్జెక్టుల్లో సెక్షన్–బి కింద 10 చొప్పున ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో ప్రతి సబ్జెక్టులో ఏవేనా 5 ప్రశ్నలకు సమాధానాలు రాసే వెసులుబాటు కల్పించారు. ఇలా మూడు సబ్జెక్టుల్లో 30 ప్రశ్నలు ఇచ్చి, 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అడిగారు. అయితే తప్పుల్లేకుండా ప్రశ్నపత్రాలు రూపొందించడంలో ఎన్టీఏ విఫలమైంది. ఆ తప్పులు చాయిస్‌ ఉన్న విభాగంలో రావడం మరింత సమస్యగా మారింది.

గందరగోళానికి కారణమిదీ..
ఈ ఏడాది జేఈఈ మెయిన్ ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు సార్లు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అందులో భాగంగా మొదటి విడత పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో నిర్వహించింది. అందులో మొదటి రోజు బీ–ఆర్క్, బీ–ప్లానింగ్‌కు నిర్వహించగా, 24 నుంచి 26 వరకు బీఈ/బీటెక్‌ కోసం జేఈఈ పరీక్షలను 6 సెషన్లలో నిర్వహించింది. అయితే 24 ఉదయం సెషన్ లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను (1 సాధారణం, మరొకటి న్యూమరికల్‌), కెమిస్ట్రీలో 1 న్యూమరికల్‌ ప్రశ్నను, అదేరోజు రెండో సెషన్ లో కెమిస్ట్రీలో మరో ప్రశ్నకు సబంధించి కీలో మార్పులు చేశారు. అదే రోజు 2వ సెషన్ గణితంలో 2 ప్రశ్నలను డ్రాప్‌ చేశారు. 26న మొదటి సెషన్ గణితంలో ఒక పశ్నను తొలగించారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను డ్రాప్‌ చేశారు. అలాగే అదే రోజు ఫిజిక్స్‌లో 3, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్‌ ప్రశ్నల జవాబుల కీలను మార్చారు. 25న ఫిజిక్స్‌లో 1 ప్రశ్నను డ్రాప్‌ చేయగా, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్‌ ప్రశ్నల కీలను మార్పు చేశారు. సాధారణంగా అయితే ఆ ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కులు హాజరైన విద్యార్థులందరికీ కలుపుతారు. అయితే ఆ ప్రశ్నలను చాయిస్‌లో వదిలేసి గణితంలో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇప్పుడు అదనంగా కలిసే మార్కుల వల్ల వారి మార్కులు వంద శాతానికి పైగా రానుంది. అయితే 100 శాతం మార్కులకు బదులుగా బోనస్‌ మార్కులతో వచ్చే 100 శాతానికిపైగా మార్కులను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే, ఆ సెషన్ లో విద్యార్థులకు కొంత మేర న్యాయం జరిగినా, అన్ని స్లాట్లను కలిపి ర్యాంకులు కేటాయించేటప్పుడు ఇతర సెషన్ల వారికి నష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

కేటగిరీల వారీగా టాపర్లుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు

కేటగిరీ

పేరు

పర్సెంటైల్‌

జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌

అంచ ప్రణవి

99.994135

’’

రామస్వామి సంతోష్‌రెడి

99.992179

ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌

తవిటి వెంకట మణికంఠ

99.981799

ఎస్టీ

ఇస్లావత్‌ నితిన్‌

99.9942523

’’

బిజిలి ప్రచోతన్‌ వర్మ

99.9845137

’’

నేనావత్‌ ప్రీతమ్‌

99.9789252

బాలికలు

కొమ్మ శరణ్య

99.9990421

బాలురు

చల్లా విశ్వనాథ్‌

99.9990421

’’

అమేయ విక్రమ సింగ్‌

99.9990405

’’

పొల్లు లక్ష్మీ సాయి లోకేష్‌రెడ్డి

99.9990357

Published date : 09 Mar 2021 04:39PM

Photo Stories