NEET PG: రాష్ట్ర ర్యాంక్‌లు సమాచారం
పరీక్ష ఫలితాలను జూన్ ఒకటో తేదీన National Board of Examinations (NBE) విడుదల చేసింది. అయితే రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు ఇంకా వెలువడలేదు. దీంతో రాష్ట్ర ర్యాంక్‌ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ర్యాంక్‌లు జూన్ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. Medical CounsellingCommittee (MCC) నుంచి రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా అందిన అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం విడుదల చేస్తుంది. యూనివర్సిటీ ప్రతినిధే నేరుగా ఢిల్లీకి వెళ్లి అర్హుల జాబితాతో కూడిన సీడీని తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంసీసీ కబురు కోసం యూనివర్సిటీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఎంసీసీ అధికారులతో రోజూ మాట్లాడుతున్నామని వారి నుంచి పిలుపు రాగానే యూనివర్సిటీ ప్రతినిధి ఢిల్లీకి వెళతారని రిజిస్ట్రార్ డాక్టర్ కె. శంకర్ ‘సాక్షి’ కి తెలిపారు. ఎంసీసీ నుంచి జాబితా వచ్చిన రెండు, మూడు రోజుల్లో ర్యాంక్‌లు విడుదల చేసి, మెరిట్ జాబితా కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.