Skip to main content

వీఐటీ-ఏపీ క్యాంపస్‌లో ప్రాంగణ ఎంపికల వెల్లువ

అమరావతి: కరోన మహమ్మారి నేపథ్యంలో కూడా దేశంలోని అన్ని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) క్యాంపస్‌లలోనూ అసాధారణ రీతిలో ప్రాంగణ ఎంపికలు వెల్లువెత్తాయి.
ఈ ఏడాది దేశంలోని వీఐటీ క్యాంపస్‌లలో వర్చువల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 382 కంపెనీలు 7,403 జాబ్ ఆఫర్లను విడుదల చేశాయి. 4,503 మంది విద్యార్థులకు బహుళ ఆఫర్లు వచ్చాయి. ఈ ఫలితాలను వీఐటీ ఫౌండర్, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ ప్రకటించారు. అలాగే వీఐటీ-ఏపీ నుంచి 2021 మే నెలలో పట్టభద్రులుకానున్న మొదటి బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో అద్భుత విజయం సాధించారన్నారు. వీఐటీ-ఏపీలో ఈ ఏడాది ప్లేస్‌మెంట్ సీజన్ 2020 జూలైలో ప్రారంభమైందని, 2021 మే వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 21, 2020 నాటికి వీఐటీ-ఏపీ మొదటి బ్యాచ్ విద్యార్థులు 73 కంపెనీల నుండి 419 జాబ్ ఆఫర్లను పొందినట్లు తెలిపారు. వీటిలో చాలా వరకు సూపర్ డ్రీం ఆఫర్లే (ఏడాదికి రూ.10 లక్షలు/అంతకంటే ఎక్కువ) అని పేర్కొన్నారు. వీఐటీ-ఏపీ, అమరావతి విద్యార్థి హర్షవర్థన్ కుష్వాహా కామ్‌వాల్ట్ నుండి ఏడాదికి రూ.20 లక్షల ఆఫర్‌ను అందుకున్నాడని తెలిపారు. మొదటిసారే ప్రాంగణ ఎంపికల్లో ఇంతటి ఘన విజయాలు సాధించటానికి విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకులు అందిస్తున్న నాణ్యతతో కూడిన విద్య, బలమైన పాఠ్యాంశ సరళితోపాటు పరిశ్రమలు, సంస్థల సహాయ సహకారాల సమిష్టి కృషే కారణమని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ చెప్పారు.
Published date : 09 Jan 2021 03:30PM

Photo Stories