Skip to main content

విద్యా వసతుల విషయంలో పట్టణ, పల్లె ప్రాంతాల మధ్య భారీ వ్యత్యాసం: ఎన్‌ఎస్‌వోసర్వే

సాక్షి,అమరావతి: విద్యా వసతుల్లో దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఇప్పటికీ చాలా వ్యత్యాసం కొనసాగుతోంది.

పాఠశాలలు వంటి మౌలిక వసతుల నుంచి.. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ నేపథ్యంలో కంప్యూటర్లు అందుబాటులో ఉండటం వరకూ అన్నిటిలోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ‘నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్’ (ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన తాజా సర్వే ఈ అంశాలను సమగ్రంగా విశ్లేషించింది. దేశంలోని 8 వేల గ్రామాలు, 6 వేల పట్టణాల్లో 1.13 లక్షల కుటుంబాలను ఎన్‌ఎస్‌వో సర్వే చేసింది. వివిధ స్థాయిల్లో చదువుతున్న దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయాలను క్రోఢీకరించింది.

సర్వే చెబుతోందిలా..

  • దేశవ్యాప్తంగా పల్లె విద్యార్థుల్లో కేవలం 4 శాతం మందికి మాత్రమే కంప్యూటర్లు అందుబాటులో ఉండగా.. పట్టణాల్లో 23 శాతం మంది విద్యార్థులకు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.
  • పల్లెల్లో 15 శాతం జనాభాకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండగా.. పట్టణాల్లో 42 శాతం జనాభాకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
  • 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు వారిలో పల్లెల్లో 24 శాతం మందికి మాత్రమే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండగా.. పట్టణాల్లో 56 శాతం మందికి ఉంది.
  • పల్లెల్లో 38 శాతం కుటుంబాలకు ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. పట్టణాల్లో 70 శాతం కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయి.
  • 7 ఏళ్లు దాటిన వారిలో అక్షరాస్యత గ్రామీణ ప్రాంతాల్లో 73.50 శాతం కాగా.. పట్టణాల్లో 87.70 శాతంగా ఉంది.
  • పాథమిక, ప్రాథమికోన్నత విద్య కోసం పల్లెల్లో 76.10 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. పట్టణాల్లో 38 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
  • గాడ్యుయేషన్ స్థాయిలో 49.70 శాతం మంది పల్లెల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతుండగా.. పట్టణాల్లో 41 శాతం మంది మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నారు.
  • మాధ్యమిక విద్య కోసం పల్లె కుటుంబాలు ఒక్కో విద్యార్థిపై సగటున ఏడాదికి రూ.5,856 వెచ్చిస్తుండగా.. పట్టణాల్లో రూ.9,148 వెచ్చిస్తున్నారు.
  • ఉన్నత విద్య కోసం పల్లెల్లో ఒక్కో విద్యార్థిపై సగటున ఏడాదికి రూ.17,518 ఖర్చు చేస్తుండగా.. పట్టణాల్లో రూ.23,832 ఖర్చు చేస్తున్నారు.
Published date : 28 Nov 2020 12:49PM

Photo Stories