వైఎస్సార్ కంటి వెలుగు స్కీమ్: త్వరలో2,577 మంది బడిపిల్లలకు కంటి శస్త్రచికిత్స
Sakshi Education
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కంటివెలుగు కింద పరీక్షించిన బడిపిల్లల్లో 2,577 మందికి త్వరలో శస్త్రచికిత్స చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వీరికి 20 రోజుల్లో ఆపరేషన్లు చేయించనున్నారు. వైఎస్సార్ కంటివెలుగు కింద బడి పిల్లలకు కంటిపరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 10న అనంతపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బడిపిల్లల్లో నేత్ర సంబంధ సమస్యలు లేకుండా చూడాలని, అవసరమైనవారికి కళ్లజోళ్లు ఇవ్వాలని, చికిత్స చేయించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం తొలిదశలో 66,17,613 మంది పిల్లలకు కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,38,751 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు. సమస్యలున్న వారిలో 4.35 లక్షల మందికి రెండోదశ పరీక్షలు చేసి 1.58 లక్షల మందికి కళ్లజోళ్లు అవసరమని తేల్చారు. వీరిలో 1.52 లక్షల మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 2,615 మంది పిల్లలకు శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వీరిలో 38 మందికి శస్త్రచికిత్స చేశారు. మిగిలిన 2,577 మందికి కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ 20 రోజుల్లోగా శస్త్రచికిత్స పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో బడిపిల్లలకు నిలిచిపోయిన శస్త్రచికిత్సల్ని త్వరలో పూర్తిచేస్తామని వైఎస్సార్ కంటివెలుగు నోడల్ అధికారి హైమావతి తెలిపారు. మిగిలిన పిల్లలకు కూడా కళ్లజోళ్లను పంపిణీ చేస్తామన్నారు.
జిల్లాపేరు | కంటిపరీక్షలు చేసిన పిల్లల సంఖ్య | దృష్టిలోపం గల పిల్లలు | పంపిణీ చేసిన కళ్లజోళ్లు | శస్త్రచికిత్స అవసరమైనవారు | శస్త్రచికిత్స పూర్తయినవారి సంఖ్య |
అనంతపురం | 5,42,222 | 38,721 | 10,460 | 209 | 2 |
చిత్తూరు | 5,29,881 | 29,695 | 10,140 | 94 | 0 |
తూర్పుగోదావరి | 7,03,083 | 33,582 | 10,403 | 212 | 3 |
గుంటూరు | 6,29,751 | 47,692 | 17,893 | 156 | 3 |
వైఎస్‌ఆర్ కడప | 4,23,966 | 32,034 | 13,054 | 114 | 2 |
కృష్ణా | 5,70,510 | 44,125 | 14,000 | 298 | 0 |
కర్నూలు | 6,74,463 | 37,450 | 14,497 | 160 | 9 |
నెల్లూరు | 3,68,509 | 20,621 | 9,302 | 31 | 1 |
ప్రకాశం | 4,36,667 | 34,023 | 11,110 | 341 | 1 |
శ్రీకాకుళం | 3,52,580 | 27,280 | 11,520 | 166 | 11 |
విశాఖపట్టణం | 5,87,938 | 47,767 | 14,299 | 244 | 1 |
విజయనగరం | 2,77,921 | 13,109 | 3,613 | 249 | 1 |
పశ్చిమగోదావరి | 5,20,122 | 32,652 | 11,766 | 341 | 4 |
మొత్తం | 66,17,613 | 4,38,751 | 1,52,057 | 2,615 | 38 |
Published date : 19 Nov 2020 01:51PM