తరగతి గదిలో 16 మందే.. వీళ్లు రోజు స్కూళ్లకు రావలసిందే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ ఇలా..
అకడమిక్ క్యాలెండర్ ఇలా..
స్కూళ్ల రీ ఓపెనింగ్ షెడ్యూల్ ఇలా..
కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు. ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లే...
- నవంబర్ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
- విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
- ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి.
- నవంబర్ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.
- డిసెంబర్ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.
- టెన్త్ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
- ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
- టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి. ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్ బోధనలో పాల్గొనాలి.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ ఇలా..
- హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.
- నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్ 23 నుంచి ప్రారంభించాలి.
- అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.
- 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు. అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు.
అకడమిక్ క్యాలెండర్ ఇలా..
- రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.
- నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్ ఉంటుంది.
- ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది.
- తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.
- పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.
- ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
- ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.
స్కూళ్ల రీ ఓపెనింగ్ షెడ్యూల్ ఇలా..
తేదీ | స్కూళ్ల కేటగిరీ | తరగతులు |
నవంబర్ 2 | అన్ని యాజమాన్యాలు | 9–12 |
నవంబర్ 2 | రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు | 9–12 |
నవంబర్ 23 | అన్ని యాజమాన్యాలు | 6–8 |
డిసెంబర్ 14 | అన్ని యాజమాన్యాలు | 1–5 |
Published date : 31 Oct 2020 02:52PM