Skip to main content

టీఎస్ గురుకుల ప్రవేశాలకు నవంబర్ డెడ్‌లైన్!

సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ నవంబర్‌లో పూర్తి చేసేలా కసరత్తు సాగుతోంది.

ఇప్పటికే విద్యాసంవత్సరం సగభాగం పూర్తి అయింది. ప్రస్తుతం సీనియర్ తరగతుల్లో బోధన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఐదో తరగతి, ఈఎంఆర్‌ఎస్‌లలో 6, 7 తరగతుల్లో పాఠ్యాంశబోధన ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో నవంబర్ నెలాఖరుకల్లా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లోని ఐదోతరగతి ప్రవేశ పరీక్ష నవంబర్ ఒకటో తేదీన నిర్వహించేందుకు సొసైటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. దాదాపు 50 వేల సీట్లను ఈ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా హాల్‌టికెట్లు జారీ చేసే ప్రక్రియ వేగవంతమైంది.

ఈఎంఆర్‌ఎస్‌లలో కూడా...
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా 2020-21 విద్యా సంవత్సరానికిగాను 12 ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రారంభించారు. ఇందులో తొలుత 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. వీటిలో ప్రవేశాలకు నవంబర్ 8న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష జరిగిన వారంలోపు ఫలితాల ప్రకటన, ఆ తర్వాత వారంలోగా ప్రవేశాలు పూర్తిచేస్తామని గిరిజన సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్కూళ్లలో రెండు తరగతులు కలిపి దాదాపు 2 వేల సీట్లు భర్తీ చేయనున్నారు.

బ్యాక్‌లాగ్ సీట్లు ఇలా...
గురుకుల విద్యాసంస్థల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందినప్పటికీ మిగుల సీట్లను సైతం నవంబర్‌లో భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాలు పూర్తయినప్పటికీ ఇంకా మిగిలిపోయిన సీట్లుంటే వాటిని కూడా భర్తీ చేస్తారు.

Published date : 24 Oct 2020 04:39PM

Photo Stories