Skip to main content

సోనూ సూద్‌ జాబ్‌ పోర్టల్‌...అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు

ముంబై : కరోనా కష్ట కాలంలో ఎందరినో ఆదుకుని.. రియాల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్‌.
వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం.. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోనూ సూద్‌. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఉపాధి కల్పన. కోవిడ్‌ కారణంగా ఎందరో జీవనోపాధి కోల్పోయారు. వారికి చేయూతనివ్వడం కోసం సోనూ సూద్‌ దేశంలోని పలు ప్రైవేట్‌ కంపెనీలతో కలిసి ‘ప్రవాసి రోజ్‌గార్‌’ పేరిట ఓ జాబ్‌ పోర్టల్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే. కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది ఈ పోర్టల్‌. ఈ నేపథ్యంలో తాజాగా సోనూ సూద్‌ ప్రయత్నం గురించి తెలుసుకున్న ఓ అంతర్జాతీయ కంపెనీ దీనిలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందేకు ముందుకు వచ్చింది.

సోనూ సూద్‌ కంపెనీ, ఒకేషనల్‌ స్కిల్‌ ప్రొవైడర్‌ ‘స్కూల్‌నెట్‌’ రెండు కలిసి టెమాసెక్‌–బ్యాక్డ్‌ జాబ్‌ మ్యాచింగ్‌ ప్లాట్‌ఫాం గుడ్‌వర్కర్‌తో కలిసి ఓ జాయింట్‌ వెంచర్‌ని ప్రారంభించనున్నాయి. దీని ద్వారా బ్లూ కాలర్‌ వర్కర్స్‌కి ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధికి గాను శిక్షణ ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో గుడ్‌వర్కర్‌ ఈ జాయింట్‌ వెంచర్‌లో 250 కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి మంచి కెరీర్‌ని అందించడం ఈ ప్లాట్‌ఫామ్‌ ఉద్దేశం. ఫైనా¯Œ ్స, హెల్త్‌కేర్, సోషల్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉపాధి కల్పించనుంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్‌ ప్రధాన కార్యాలయంగా గల గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టెమాసెక్‌ స్థాపించిన గుడ్‌వర్కర్‌ ముందుకు వచ్చింది. ఈ జాయింట్‌ వెంచర్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంఛనంగా తన పనులను ఆరంభించనుంది.

ఈ సందర్భంగా సోనూ సూద్‌ మాట్లాడుతూ.. ‘లక్షలాది మంది యువతకు మంచి జీవనోపాధి, భవిష్యత్తు అందించాలనే నా కల ఈ పార్టనర్‌షిప్‌ ద్వారా నేరవేరనుంది. లక్షలాది మంది వలస కార్మికులకు దీని ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇవ్వనున్నాం’ అని తెలిపారు. సోనూ సూద్, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ అందించే ‘స్కూల్‌నెట్‌’తో కలిసి 2020 జూలైలో ‘ప్రవాసి రోజ్‌గార్‌’ ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌ని ప్రారంభించారు. వలసకార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ని ప్రారంభించారు. ఇక దీనిని లాంచ్‌ చేసిన నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగార్థులు దీనిలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
Published date : 26 Nov 2020 03:57PM

Photo Stories