Skip to main content

సమాజంతో చదువుల అనుసంధానందిశగా.. పాఠ్య ప్రణాళికల్లో మార్పులు!

సాక్షి, అమరావతి:విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం సమాజాభివృద్ధికి వీలుగా చదువులను, విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించింది. చదువులకు, సమాజానికి సంబంధం లేదన్నట్టుగా కొనసాగుతున్న పాఠ్య ప్రణాళికలను మార్పు చేసింది.

విద్యార్థులు సమాజాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చేయడంతోపాటు చదువుల అనంతరం పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేసింది. సాంకేతిక, సాంకేతిక అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో సిలబస్‌ను ఇందుకు అనుగుణంగా తీర్చిదిద్దింది.

సాంకేతికేతర యూజీ కోర్సుల్లో మార్పులిలా..

  • ఎంపిక ఆధారిత ప్రామాణ్య విధానం (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్)(సిబిసిఎస్)లో నాన్-ప్రొఫెషనల్ యూజీ ప్రోగ్రామ్‌ల సిలబస్‌ను మార్పు చేసి 2020-21 విద్యాసంవత్సరం నుండి అమల్లోకి తెస్తున్నారు.
  • నైపుణ్య (లైఫ్ స్కిల్) కోర్సులు, నైపుణ్య అభివృద్ధి కోర్సులు ఏర్పాటు చేయనున్నారు.
  • మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల తప్పనిసరి అప్రెంటిస్‌షిప్, నూతన విద్యా విధానంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో అమలు చేస్తారు.
  • సవరించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కోర్సులు, అప్రెంటిస్‌షిప్ క్రెడిట్ల బదిలీ ఆయా సంస్థల మధ్య సులభతరం అవుతుంది.
  • 2020-21 నుంచి నాన్-ప్రొఫెషనల్ యూజీ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టాలన్నది మరో ప్రతిపాదన. తద్వారా మెరిట్, పారదర్శకతను ప్రోత్సహించడం, రిజర్వేషన్లు అమలు చేయడం, అక్రమాలను అరికట్టడానికి వీలవుతుంది.
  • ఈ అంశంలో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


సాంకేతిక కోర్సుల్లో మార్పులిలా..

  • యూజీ కోర్సుల్లో 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్. నైపుణ్యాధారిత కోర్సులు, అడ్వాన్స్ డ్ స్కిల్స్ కోర్సుల ప్రవేశం.
  • బీటెక్‌లో ఆనర్స్ అభ్యసించే వారికి అదనంగా 20 క్రెడిట్ల కేటాయింపు. క్రెడిట్లను పొందే విద్యార్థులకు మెయిన్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు.


సంస్కరణల దిశగా..

  • విద్యారంగంలో సంస్కరణల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ (బెంగళూరు) ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీ నియమించి.. ఉన్నత, పాఠశాల విద్యారంగాలకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల అధ్యక్షతన పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
  • బాలకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఉన్నత విద్యారంగంలో సిలబస్, పాఠ్య ప్రణాళికలను నేటి అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, మారుతున్న సమాజ అవసరాలకు తగినట్టుగా వారిని తీర్చిదిద్దే దిశగా మార్పులు చేయించారు.
  • వరంగల్ నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు నేతృత్వంలో ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను పునఃసమీక్షించి మార్పులు చేయించారు.
  • పభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథరెడ్డి, ఉన్నత విద్యామండలి అధికారులతో ఈ కమిటీ పలుమార్లు సమావేశమై కరిక్యులమ్‌ను ప్రక్షాళించి పలు సిఫార్సులు చేసింది.
  • దీని ప్రకారం విద్యను సమాజంతో అనుసంధానించేలా ప్రణాళికలు, సిలబస్‌లో మార్పులు తెచ్చింది.
  • 180 గంటల కాల పరిమితితో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్‌ను కరిక్యులమ్‌లో భాగం చేసింది. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాల కోసం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయనుంది.
Published date : 07 Sep 2020 03:42PM

Photo Stories