స్కూళ్లలో ‘నాడు-నేడు’ జూన్ కల్లా పూర్తవ్వాలి: వైఎస్ జగన్
Sakshi Education
సాక్షి, అమరావతి: నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టే పనులు జూన్ కల్లా పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలను మార్చాలని, అన్ని స్కూళ్లలో తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమ పనుల పురోగతిపై ఏప్రిల్ 25న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.
- స్కూళ్లలో ఫర్నిచర్, చాక్ బోర్డ్స్ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు సంబంధించి కూడా త్వరలో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 72,596 గ్రీన్ చాక్ బోర్డ్స్ కోసం రివర్స్ టెండర్లలో రూ.5.07 కోట్లు ఆదా అయ్యాయన్నారు. రూ.79.84 కోట్లతో ఎల్-1 కోట్ చేస్తే.. రివర్స్ టెండర్లలో రూ.74.77 కోట్లుగా ఖరారైందని చెప్పారు.
- 16,334 అల్మరాల కోసం రూ.19.58 కోట్లకు ఎల్-1 కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో రూ.15.35కు ఖరారైందని, తద్వారా రూ.4.23 కోట్లు ఆదా అయ్యాయని అధికారులు తెలిపారు.
- స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫామ్స్, స్కూలు బ్యాగు నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, నాణ్యతగా ఉండాలని ఆదేశించారు.
- l ఇదిలా ఉండగా రివర్స్ టెండర్ల విధానం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.1,995.91 కోట్లు ఆదా అయ్యాయి.
Published date : 27 Apr 2020 03:41PM