సెప్టెంబర్ మూడో వారం నుంచి కొత్త పాఠాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిజిటల్ విద్యా బోధన ప్రారంభం కానుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మొదటి రెండు వారాలు విద్యార్థులకు పూర్వ తరగతికి సంబంధించిన పాఠాలను బోధించి, పైతరగతి కోసం సంసిద్ధులను చేస్తారన్నారు. మూడో వారం నుంచి పైతరగతిలోని పాఠాలు ప్రారంభం అవుతాయని.. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 28న మీడియాతో మంత్రి మాట్లాడారు.
వివరాలు ఆమె మాటల్లోనే..
వివరాలు ఆమె మాటల్లోనే..
- పభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా బోధన అందిస్తాం. డిజిటల్ పాఠాలను ఎవరైనా వినకపోతే, తరువాత వినాలనుకున్నా టీశాట్ యాప్‌లో పొంద వచ్చు. వాటితోపాటు వర్క్ షీట్లను కూడా https://scert.telangana.gov.in/ లో పొందవచ్చు.
- విద్యార్థులందరికీ దూరదర్శన్, టీ శాట్ అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న దానిపై జిల్లా, మండల అధికారులు పరిశీలిస్తారు. అవి లేని చోట తగిన ఏర్పాట్లు చేస్తారు.
- డిజిటల్ పాఠాలు ఎంతమేరకు అర్థమవుతున్నాయన్నది వర్క్‌షీట్ల ద్వారా అంచనా వేస్తాం. మొదటిసారిగా తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో రూపొందించిన వాటిని ఆన్‌లైన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా అందజేస్తాం.
- దూరదర్శన్‌లో 3,4,5 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 10.30- 11.30 గంటల వరకు 30 నిమిషాల చొప్పున 2 తరగతులు ఉంటాయి.
- 6,7,8,9,10 తరగతులకు 11.30 నుంచి ఒంటి గంట వరకు 30 నిమిషాల చొప్పున 3 తరగతుల పాఠాలు ఉంటాయి.
- టీశాట్ ద్వారా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 2-4 గంటల వరకు 6,7,8,9,10 తరగతుల విద్యార్థులకు పాఠాలు ఉంటాయి. ఒక్కో పాఠం 60 నిమిషాల చొప్పున ఐదు తరగతులకు బోధిస్తారు.
- రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర జనరల్ సబ్జెక్టుల(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, కామర్స్ తదితర) పాఠాలు ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల చొప్పున 3 తరగతులు ఉంటాయి.
- మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు లాంగ్వేజెస్ (తెలుగు, ఇంగ్లిష్), వొకేషనల్ కోర్సులకు సంబంధించి రెండు తరగతులను నిర్వహిస్తారు.
- డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులకు గూగుల్ మీట్, జూమ్ యాప్, యూజీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తారు.
- కరోనా నేపథ్యంలో వీలైనంత వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే డిటెన్షన్‌ను ఎత్తి వేసి పైతరగతికి ప్రమోట్ చేశాం. యూజీసీ ఆదేశాలు, కోర్టు తీర్పు మేరకు డిగ్రీ, పీజీ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం.
Published date : 29 Aug 2020 03:38PM