Skip to main content

ఫీజులు పెంచుకునేందుకు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కొత్త ఎత్తుగడ!!

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల ఫీజులను పెంచుకునేందుకు ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చాయి. కామన్ ఫీజు పేరుతో ఫీజుల పెంపునకు ఉన్నత విద్యా మండలిపై ఒత్తిడి పెంచాయి.
ఒకే రకమైన కోర్సులకు ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఫీజులు ఉన్నాయని, దాంతో బడ్జెట్ అంచనాలు, రీయింబర్స్‌మెంట్ మంజూరులో సమస్యలు తలెత్తుతున్నాయంటూ రీయింబర్స్‌మెంట్ ఇచ్చే సంక్షేమ శాఖల నుంచి రాయబారం నడుపుతున్నాయి. యాజమన్యాలతో అనుకూలంగా ఉండే కొంతమంది అధికారులు ఇందుకు సై అంటున్నారు. దీంతో రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో కామన్ ఫీజు పేరుతో ఇటు తల్లిదండ్రులపై ప్రత్యక్షంగా, అటు ప్రభుత్వంపై రీయింబర్స్‌మెంట్ రూపంలో భారీగా భారం మోపేందుకు రంగం సిద్ధం అవుతోంది.

845 ప్రైవేటు కాలేజీలు.. 1.55 లక్షల మంది విద్యార్థులు..
రాష్ట్రంలోని 1,164 డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిల్లో 4,55,265 సీట్లు ఉన్నాయి. అందులో 2019-20 విద్యా సంవత్సరంలో 2,22,708 సీట్లు భర్తీ అయ్యాయి. అయితే వాటిల్లో గురుకులాలు, మైనారిటీ కాలేజీలు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేసుకున్నవి 118 కాలేజీలు ఉన్నాయి. అవి మినహాయిస్తే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా 2019-20 విద్యా సంవత్సరంలో 1,046 కాలేజీల్లోని 4,12,805 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా 1,99,806 సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 845 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 1.55 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి.

రీయింబర్స్‌మెంట్ నుంచి మినహాయిస్తాం..
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో 80 శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇస్తోంది. మరో 20 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజులను చెల్లిస్తున్నారు. కామన్ ఫీజు పేరుతో ఇప్పుడు ఫీజులను పెంచితే ఈ మేరకు భారం తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వంపైనా పడనుంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా వెచ్చిస్తుండగా, కామన్ ఫీజు చేస్తే మరో రూ.100 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. అయితే ఆ భారాన్ని ప్రభుత్వం అంగీకరించదనే ఆలోచనతో మరో ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడున్న ఫీజులపై పెంచే మొత్తాన్ని ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్ (వర్తింపజేయకుండా) కాకుండా తల్లిదండ్రులే చెల్లించేలా నిబంధనలు పొందుపరచాలని ఉన్నత విద్యా మండలికి యాజమాన్యాలే సలహా ఇచ్చేశాయి. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఒత్తిడికి తలొగ్గిన యంత్రాంగం అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే ఓయూ పరిధిలో ఫీజు పెంపు ..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో వర్సిటీ నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా రూ.10 వేల చొప్పున యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇందుకు ఓయూనే ఉత్తర్వులిచ్చి అనుమతించింది. ప్రస్తుతం ఓయూ పరిధిలో 420 డిగ్రీ కాలేజీలు ఉండగా అందులో 325 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో 60 వేల మందికిపైగా విద్యార్థులు చేరారు. ఆయా కాలేజీల్లో వర్సిటీ నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా రూ.10 వేల చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన విద్యార్థుల నుంచి రూ.60 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు కామన్ ఫీజు చేస్తే ఉస్మానియానే కాదు మిగతా వర్సిటీ పరిధుల్లోని కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెరగనున్నాయి.

కామన్ ఫీజును అడిగేదే పెంపు కోసం..
ఫీజుల సమీక్ష చేయడం అంటేనే పరోక్షంగా ఫీజులను పెంచడం. ఏ పేరు పెట్టుకున్నా తగ్గించేదైతే ఉండదనేది బహిరంగ రహస్యమే. అందుకే కామన్ ఫీజు ముసుగులో ఇప్పుడు డిగ్రీ కాలేజీల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఫీజుల భారం మోపేందుకు యాజమాన్యాలు సిద్ధం అయ్యాయి. అందుకు వంతపాడుతూ యంత్రాంగం సిద్ధం అవుతుండటం విద్యార్థులను ఆందోళనలో పడేస్తోంది.

వర్సిటీల్లో కోర్సుల వారీగా ఫీజులు..

కోర్సు

కాకతీయ

తెలంగాణ

మహాత్మాగాంధీ

శాతవాహన

పాలమూరు

ఉస్మానియా

బీఏ

6,170

6,200

6,370

6,390

6,370

6,370

బీకాం కంప్యూటర్

12,470

10,800

8,950

10,150

8,950

10,950

బీకాం జనరల్

12,370

8,800

10,950

8,550

10,890

8,950

బీఎస్సీ

13,520

11,900

12,950

11,650

10,950

10,750

Published date : 10 Feb 2020 03:54PM

Photo Stories