Skip to main content

ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు జీవోపై స్టే: హైకోర్టు

సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో 2019–20 సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజులను 30 శాతం మేర తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన జీవో 57పై హైకోర్టు స్టే విధించింది.
అయితే ఫీజులు, ఫీజుల బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఆన్‌లైన్ లేదా భౌతిక తరగతులకు హాజరు కాకుండా విద్యార్థులను అడ్డుకోవడానికి వీల్లేదని స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఇదే కారణంతో విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఆపడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. ఆరు వాయిదాల్లో ఫీజులను వసూలు చేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఫీజుల చెల్లింపుల విషయంలో ఇబ్బంది ఉన్న తల్లిదండ్రులు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలను ఆశ్రయించాలని, యాజమాన్యాలు కూడా వారి అభ్యర్థనలను సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. జీవో 57ను సవాల్‌ చేస్తూ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ఇస్మా) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి ఇటీవల విచారణ జరిపారు. ఇస్మా తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, ఫీజుల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని చెప్పారు. నలందా ఎడ్యుకేషనల్‌ సొసైటీ కేసులో కాలేజీలు క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయకుండా, లాభార్జనతో ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత వరకే ప్రభుత్వ పాత్ర అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌ నేపథ్యంలో తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే 30 శాతం మేర ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని వివరించారు. విద్య పేరుతో స్కూళ్లు, కాలేజీలు లాభార్జన చేయడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. జీవో 57 అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరముందని జస్టిస్‌ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Published date : 09 Apr 2021 02:47PM

Photo Stories