పిల్లలను బడులకు పంపేందుకు 12 లక్షల మంది పేరెంట్స్ ఓకే: ట్రస్మా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలను పునః ప్రారంభిస్తే పిల్లలను పంపేందుకు మెజారిటీ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారని ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) వెల్లడించింది.
కరోనా కారణంగా దాదాపు పదినెలలుగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. బడులను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ... ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ అంశంలో తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల పాఠశాలల యాజమాన్యాలు ఫోన్లు చేయడం, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ ద్వారా తల్లిదండ్రులను సంప్రదించాయని, 12 లక్షల మంది పేరెంట్స్ పిల్లలను బడులకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేశారని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు శనివారం తెలిపారు. నాలుగో తరగతి, ఆపై క్లాసులకు చెందిన పిల్లలను పంపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని, అంతకంటే చిన్నపిల్లలను పంపేందుకు ఇష్టపడటం లేదని వివరించారు. పాఠశాలలను పునఃప్రారంభించాలని రెండురోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశామని, సంక్రాంతి తర్వాత తెరిచేందుకు అనుమతిచ్చే అవకాశం ఉందన్నారు.
Published date : 21 Dec 2020 03:42PM