Skip to main content

పీఎఫ్‌ ఖాతాల నుంచి రూ. 70 వేల కోట్లు విత్‌డ్రా.. ఎందుకో తెలుసా..!

సాక్షి, హైదరాబాద్‌: పైసాపైసా కూడబెట్టి భావి అవసరాలకు ఉపయోగించాలనుకునే ‘భవిష్యనిధి’కరిగిపోతోంది.
ఉద్యోగి తన జీవితంలో కన్న కలలను సాకారం చేసుకునేందుకు ధీమా ఇచ్చే భవిష్యనిధిని నెలవారీ ఖర్చులకు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన విలయంతో సగటు ఉద్యోగి విలవిలలాడుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉద్యోగుల వేతనంలో కోతలు, కొన్నిచోట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోతుండగా.. కొత్త కొలువుల సంగతి ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు పీఎఫ్‌ ఉపసంహరణ వైపు మళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఈ నిధిని వినియోగించుకునే వెసులుబాటు ఉండగా... కోవిడ్‌–19తో ఏర్పడిన ఎమర్జెన్సీ ధాటికి భవిష్య‘నిధి’లో ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది.

ప్రతి ఇద్దరిలో ఒకరు...
ఉద్యోగి భవిష్యనిధి నుంచి ఉపసంహరణ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పరిస్థితిని పరిశీలిస్తే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు పీఎఫ్‌ విత్‌డ్రా కోసం దరఖాస్తు సమర్పిస్తున్నారు. దేశంలో గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌తో వాణిజ్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఆర్థిక స్థితి కుప్పకూలింది. ఈ ప్రభావం వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పడింది. కొన్ని కంపెనీలు నెలల తరబడి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. ఇంకొన్ని ఉద్యోగులను పనిలో నుంచి తొలగించాయి. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి తక్షణ సాయం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌–19 నేపథ్యంలో పీఎఫ్‌ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఉద్యోగి భవిష్య నిధి నుంచి గరిష్టంగా మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తూ... దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కొందరు కోవిడ్‌–19 కారణంతో, మరికొందరు అత్యవసర స్థితిని, ఇంకొందరు ఇతరత్రా అవసరాలను చూపి విత్‌డ్రాలకు దిగారు. దేశంలో మొత్తంగా 6.44 కోట్ల ఈపీఎఫ్‌ ఖాతాలు యాక్టివ్‌గా ఉండగా... ఇందులో 2020–21 సంవత్సరంలో ఇప్పటివరకు 2.85 కోట్ల మంది క్లెయిమ్స్‌ సమర్పించారు. మొత్తం ఖాతాదారుల్లో 44.35 శాతం మంది విత్‌డ్రాలకు మొగ్గు చూపారు.

కోవిడ్‌ కేటగిరీలో 15 వేల కోట్లు
గత నెల 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం... దేశంలోని ఈపీఎఫ్‌ ఖాతా దారుల్లో 60.88 లక్షల మంది కోవిడ్‌–19 కారణంతో నగదు ఉపసంహరణ దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 30వ తేదీ నాటికి కోవిడ్‌–19 కేటగిరీలోనే ఏకంగా రూ.15,256.05 కోట్లు ఖాతాదారులు ఉపసంహరించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన దరఖాస్తుదారుల్లో సగటున ఒక్కో చందాదారుడు రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకున్నట్లే. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరుకు వచ్చిన 2.85 కోట్ల క్లెయిమ్స్‌కు సంబంధించి దాదాపు రూ.70 వేల కోట్లకు పైగా విత్‌డ్రా చేసుకున్నట్లు అంచనా. కోవిడ్‌–19 కేటగిరీలో సగటున రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకోగా.. ఇతర కేటగిరీల్లో 3 నెలల వేతన సీలింగ్‌ నిబంధన ఉండదు.

ఓ కార్పొరేట్‌ కంపెనీలో సీనియర్‌ ట్రైనర్‌గా పదేళ్ల పాటు పనిచేసిన అమర్‌నాథ్‌ రెడ్డి గతేడాది ఆగస్టులో ఉద్యోగం కోల్పోయాడు. కోవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సర్దుబాటు క్రమంలో అమర్‌ పింక్‌స్లిప్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఆర్నెల్లుగా అమర్‌ ఉద్యోగవేట సాగిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం లేకపోవడంతో నెలవారీ ఖర్చుల నిమిత్తం అప్పుల జోలికి పోకుండా తన భవిష్యనిధి ఖాతాలో డబ్బును కోవిడ్‌–19 పరిస్థితి కింద గతేడాది సెప్టెంబర్‌ నెలాఖరులో రూ.30 వేలు విత్‌డ్రా చేశాడు. అనంతరం ఉద్యోగం దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డిసెంబర్‌లో మరో రూ. 30 వేలు ఉపసంహరించుకున్నాడు. భవిష్యత్తు అవసరాల కోసం పదేళ్లుగా కూడబెట్టుకున్న నిధిలో 35 శాతం నగదు ఆర్నెల్లలోనే కుటుంబ పోషణకు ఖర్చయింది.

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) సమాచారం క్లుప్తంగా...

ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్లు

6,69,035

పీఎఫ్‌ ఖాతాదారులు (యాక్టివ్‌)

6,44,07,953

పెన్షనర్లు

68,90,644

2020–21 సంవత్సరంలో క్లెయిమ్స్‌

2,85,65,817

ప్రస్తుత వార్షికంలో విత్‌డ్రాయల్స్‌ శాతం

44.35%


2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌–19 కేటగిరీలో..

విత్‌డ్రాయల్స్‌

60, 88,980

విత్‌డ్రా చేసిన నగదు

15,256.05 కోట్లు


పర్సనల్‌ లోన్‌కు బదులుగా
గతేడాది నవంబర్‌లో మా కంపెనీలో చాలామంది ఉద్యోగులు జాబ్‌ కోల్పోయారు. అందులో నేను ఒకదాన్ని. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి నాకు నెలకు సగం వేతనం మాత్రమే వస్తుండడంతో ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చింది. పీఎఫ్‌ ఖాతాలో 1.2 లక్షలు ఉండటంతో పర్సనల్‌ లోన్‌కు బదులుగా ఈ నిధిని విత్‌డ్రా చేసుకున్నా. నెలనెలా తిరిగి చెల్లించడం, వడ్డీభారం ఉండదనే ఉద్దేశంతో పీఎఫ్‌ నిధిని వాడుకోవడం మేలని నిర్ణయించుకున్నా. భవిష్యత్‌ అవసరాల సంగతి అటుంచితే.. ఇప్పుడున్న ఇబ్బందుల అధిగమించడానికి ప్రాధాన్యమిచ్చా.
– వి.వైదేహి, ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగం ఉద్యోగి

నాన్న కరోనా చికిత్సకు రూ. 1.8 లక్షలు ఖర్చయింది
కరోనా వైరస్‌ మా కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతేడాది జూన్‌లో నాకు కరోనా సోకింది. వారంలో కోలుకున్నాను. కానీ అంతలోనే నాన్నకు వైరస్‌ సోకడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో పరిస్థితి చేయిదాటింది. ఆసుపత్రిలో చేర్పిస్తే రూ. 1.8 లక్షలు ఖర్చయింది. కానీ నాన్న చనిపోయారు. ఆసుపత్రి బిల్లు కోసం స్నేహితుడి వద్ద అప్పు చేసి చెల్లించాను. పద్నాలుగు సంవత్సరాలుగా పీఎఫ్‌ నిధిలో పోగుచేసిన రూ.1.6 లక్షలు విత్‌డ్రా చేసి స్నేహితుడి అప్పు చెల్లించాను.
– నదీమ్, అటోమొబైల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌
Published date : 25 Feb 2021 04:46PM

Photo Stories