పీఆర్సీపై 40 రోజులుగా కసరత్తు.. అయినా కొలిక్కిరాని వ్యవహారం!
సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గత డిసెంబర్ 31న సమర్పించిన నివేదికపై గత 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు నిర్వహించినా, ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఈలోగా రాష్ట్రం లోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజక వర్గాలకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మార్చి 23 వరకు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. పట్టభద్రుల ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోరాదని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో పీఆర్సీ, పదవీ విరమణ వయోపరిమితి పెంపు, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులపై ఏదైనా ప్రకటన చేసేందుకు ప్రభుత్వం మార్చి 23 వరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
వెంటనే సాగర్ ఉప ఎన్నికలు..
ఇటు మండలి ఎన్నికలు ముగిసేలోగా నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత డిసెంబర్ 1న హఠాన్మరణం చెందారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ స్థానానికి ఎన్నికల కోసం మార్చిలో షెడ్యూల్‌ను ప్రకటించి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే నెలలోగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ముగియనుండగా, ఆ తర్వాతే ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయోపరిమితి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలగనుంది.
ప్రభుత్వం కోరితే ఈసీఐ నిర్ణయం: సీఈఓ
ఉద్యోగుల వేతనాల పెంపుపై పీఆర్సీ ఇచ్చిన నివేదికను ఆమోదించి ప్రభుత్వం అమలు చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ప్రభుత్వం చేసే విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
పోలీసు కొలువుల ప్రకటన మరింత జాప్యం..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పోలీస్ ఉద్యోగాల ప్రకటనకు అడ్డంకిగా మారింది. పోలీసు శాఖలో 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలీసు శాఖ కూడా తమ వద్ద ఖాళీగా ఉన్న దాదాపు 19,400 పోస్టుల (అందులో 450 వరకు ఎస్సై, మిగిలినవి కానిస్టేబుల్ పోస్టులు) వివరాలను కూడా ప్రభుత్వానికి పంపించింది. ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే.. అప్పుడు నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు చాలా మందిలో ఆశలు రేగాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల వాతావరణంతో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరా?
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేర్వేరు అని రాష్ట్ర ప్రభుత్వం మూడ్రోజుల కింద కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంచేందుకు సానుకూలంగా ఉన్నామని, అయితే ఉపాధ్యా యులకు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. చాలాకాలంగా ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్య పొసగడం లేదు. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ అంశాలపై స్పష్టత, పరిష్కారం లభించే వరకు పీఆర్సీ అమలు మరికొంత ఆలస్యం జరిగే అవకాశా లున్నాయి. పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు అంశాలపై ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం ఒక్కటే మిగిలి ఉందని, మిగిలిన ప్రక్రియలన్నీ ముగిశాయని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉసూరుమనిపించిన కోడ్..
పదో పీఆర్సీ అమలు గడువు 2018 జూన్ తో ముగిసిపోయింది. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో 2018 మేలో పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్సీ నివేదికను సమర్పించడం / స్వీకరించడంలో తీవ్ర తాత్సా రం జరిగింది. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 31న ప్రభుత్వానికి నివేదిక అందింది. జనవరి మూడో వారంలోనే పీఆర్సీ ఫిట్‌మెంట్ శాతంతో పాటు పదవీ విరమణ వయోపరి మితి పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని డిసెంబర్ 31న ఆయనను కలుసుకున్న టీజీవో, టీఎన్ జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలు ప్రకటించారు. పీఆర్సీ నివేదికపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఆర్థిక, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. పీఆర్సీ నివేదికపై త్రిసభ్య కమిటీ అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చలను జనవరి తొలి వారంలోగా పూర్తి చేసి రెండో వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, మూడో వారంలో పీఆర్సీ ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు ఉద్యోగ నేతలు అప్పట్లో వెల్లడించారు. అయితే, జనవరి 27న పీఆర్సీ నివేదిక బహిర్గతమైంది. సీఆర్ బిస్వాల్ కమిటీ కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జనవరి 27, 28, 29 తేదీల్లో త్రిసభ్య కమిటీ వరుసగా మూడ్రోజుల పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో వేర్వేరుగా చర్చల్లో అభిప్రాయాలను స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన వస్తుందని గత 40 రోజులుగా ఆశతో ఎదురుచూసిన ప్రభుత్వ ఉద్యోగులు చివరకు మండలి ఎన్నికల కోడ్ రూపంలో ఉసూరుమనక తప్పలేదు.