పౌష్టికాహార లేమితో పిల్లల్లో ఎదుగుదల లోపం
Sakshi Education
‘తిండి కలిగితే కండకలదోయ్’ అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పేశాడు కానీ.. సకాలంలో పెట్టే తిండే పిల్లలు తగినంత ఎత్తు ఎదిగేం దుకు ఉపయోగపడుతుందని అంత ర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా నిర్ధారించింది.
స్కూలు పిల్లల్లో తగిన పౌష్టికాహారం లేకపోవడం వల్ల వారు కనీసం 20 సెంటీమీటర్ల వరకు ఎత్తు ఎదగలేకపోతున్నారని, వారి బరువు పైనా ఇది ప్రభావం చూపుతోందని ఇంపీరియర్ కాలేజ్ ఆఫ్ లండన్ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా జరి గిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. సుమారు 193 దేశాల్లోని ఆరున్నర కోట్ల మంది పిల్లలు, కౌమారులు (ఐదు నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు) ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ వయసు వారి ఆరోగ్యానికి ఎత్తు, బరువు రెండూ సూచికలన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, గ్వాటెమాల (ప్రపంచంలోనే అతితక్కువ సగటు ఎత్తు ఉన్న బాలికలు ఈ దేశాల్లోనే ఉన్నారు)ల్లో 19 ఏళ్ల బాలిక కూడా నెదర్లాండ్స్‌లోని 11 ఏళ్ల బాలిక ఎత్తు, బరువుకు సమానంగా ఉంది. చిన్నతనంలో తినే తిండి పోషకాలతో లేకపోయినా, తీసుకొనే ఆహారంలో విపరీతమైన తేడాలున్నా పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోవడమే కాకుండా.. ఊబకాయులుగా తయారయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ పరిణామం కారణంగా వారు జీవితాంతం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. 1985 నుంచి 2019 మధ్యకాలంలోని సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి దేశాల బాలబాలికల సమాచారాన్ని ఈ అధ్యయనంలో భాగంగా విశ్లేషించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా, దక్షిణ కొరియాల్లోని పిల్లల్లో సగటు ఎత్తు వేగంగా పెరుగుతుండటం. గతేడాది చైనాలో బాలుర సగటు ఎత్తు 1985లో నమోదైన గణాంకాలతో పోలిస్తే 8 సెంటీమీటర్ల వరకు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పిల్లల ఎత్తు ఆధారంగా తయారు చేసిన జాబితాలో చైనా 1985లో 150వ స్థానంలో ఉంటే 2019లో ఏకంగా 65వ స్థానానికి ఎదిగింది.
Published date : 01 Dec 2020 04:43PM