Skip to main content

పాఠశాలల వేసవి సెలవులు జూన్‌ 20 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెలవులు టీచర్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను ఈనెల 15 వరకు పొడిగించింది. దీంతో 16 నుంచి టీచర్లు స్కూళ్లకు వచ్చేలా చర్యలు చేపడతామని, అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం వేసవి సెలవులను 20 వరకు పొడిగించాలని ఆదేశించడంతో పాఠశాల విద్యా డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు, జిల్లా విద్యా శిక్షణ సంస్థలకు (డైట్‌) ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ నెల 21 నుంచి టీచర్లను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం చెబుతుందా లేదా అన్నది తేలలేదు. జూలై 1 నుంచి పాఠశాలల్లో డిజిటల్‌/ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో టీచర్లను ఎప్పటినుంచి స్కూళ్లకు రమ్మని చెబుతారన్నది చర్చనీయాంశంగా మారింది. టీచర్లకు కూడా జూలై 1 నుంచే స్కూళ్లకు రావాలని చెబితే బాగుంటుందని సంఘాలు పేర్కొంటున్నాయి.

జూనియర్‌ కాలేజీలకు..
అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీలకూ వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు కాలేజీల్లో ఆన్‌ లైన్‌ ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. నాన్‌టీచింగ్‌ స్టాప్‌ విడతల వారీగా విధులకు హాజరుకావాలని, బో«ధన సిబ్బంది అందుబాటులో ఉండాలని వివరించారు. కాగా, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూలై ఒకటో తేదీ నుంచి, ఫస్టియర్‌ విద్యార్థులకు జూలై 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
Published date : 16 Jun 2021 05:45PM

Photo Stories