Skip to main content

పాఠశాలల పునఃప్రారంభంపై ఎన్‌సీఈఆర్‌టీ సూచనలు

సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సూచించింది.

కోవిడ్ ప్రభావంతో విద్యలో ముఖ్యంగా పాఠశాల విద్యలో పలు మార్పులు తప్పనిసరి అవుతున్నాయని తెలిపింది. పాఠశాలల పునఃప్రారంభానికి పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో చర్యలు ఎలా ఉండాలో నిర్దేశించింది. పాఠశాలలు తెరిచాక పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రుల కమిటీలతోపాటు సామాజిక భాగస్వామ్యం అవసరమని వివరించింది. ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని తాజాగా రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

ఎన్‌సీఈఆర్‌టీ సూచనలివే..

  • కోవిడ్ వల్ల పిల్లలు, తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని నివారించేందుకు ముందుగా వారిని సన్నద్ధులను చేయాలి. టీచర్లు వారికి అవసరమైన పద్ధతుల్లో కౌన్సెలింగ్ చేపట్టాలి. కోవిడ్ సమయంలో అభ్యసన ప్రక్రియల్లో పిల్లల్లో ఏర్పడిన అంతరాలను తగ్గించాలి.
  • విద్యా సంవత్సరం ఆలస్యమైనందున ప్రత్యామ్నాయ క్యాలెండర్‌తోపాటు అందుకనుగుణమైన విద్యాభ్యసన పద్ధతులను అవలంబించాలి.
  • పాఠశాలలు తెరిచినా, తెరవలేని పరిస్థితులున్నా రెండింటికీ అనుగుణంగా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలి.
  • సిలబస్, బోధన, పాఠ్యపుస్తకాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాల్లో సరికొత్త విధానాలతో పునర్నిర్మాణం అవసరం.
  • ఫలితాల ఆధారిత బోధనాభ్యసన ప్రక్రియ (అవుట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్) కోసం సమగ్ర ప్రణాళికలు ఉండాలి.
  • ఇంటర్నెట్ ఆధారిత చానెల్, రేడియో, పాడ్‌కాస్ట్, ఐవీఆర్‌ఎస్, టీవీ, డీటీహెచ్ చానెళ్లను వినియోగించుకోవాలి.
  • పత్యామ్నాయ ప్రణాళికల అమలుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), డైట్ తదితర విభాగాల వారిని, నోడల్ అధికారులను నియమించాలి.
  • కోవిడ్ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు, ప్రధానోపాధ్యాయులలో ప్రత్యామ్నాయ ప్రణాళికలకు తగ్గట్టు సామర్థ్యాలను పెంపొందించాలి.
  • స్కూళ్లకు విద్యార్థులు రాలేని పరిస్థితుల్లో చిన్న తరగతుల పిల్లలకు వలంటీర్లు, ఉపాధ్యాయులను నియమించి ఇళ్ల వద్దనే పరీక్షలు రాయించే ఏర్పాట్లుండాలి.
  • ఇందుకోసం అన్ని సబ్జెక్టులకు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రశ్నపత్రాల రూపకల్పన అవసరం.
  • ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), వివిధ ఆన్‌లైన్ విద్యావేదికలను వినియోగించుకుంటూ ఉపాధ్యాయులు తమంతట తాము నూతన విధానాలను అనుసరించేలా నవీకరించుకోవాలి.
Published date : 25 Aug 2020 01:04PM

Photo Stories