Skip to main content

మూడంచెల విధానంతో పటిష్టంగా ‘చదువుల పునాది’

సాక్షి, అమరావతి: విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంస్కరణలు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను పేద కుటుంబాల్లోని విద్యార్థులందరికీ అందేలా మార్గం సుగమం చేస్తోంది.

విద్యారంభం నుంచే ప్రతి విద్యార్థికి గట్టి పునాదులు వేసి విశిష్ట వికాసం పొందేలా శాస్త్రీయ దృక్పథంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తుండటంపై విద్యారంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడి, మన బడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాల ద్వారా ప్రతి తల్లీ తన బిడ్డలను పాఠశాలలకు పంపేలా చేయడంతో పాటు విద్యార్థులకూ చదువులపై ఆసక్తి పెరిగేలా ముఖ్యమంత్రి తొలి దశ చర్యలు చేపట్టారు. దీనివల్ల పాఠశాలల్లో చేరికలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఏడాదిలోనే 6.5 లక్షల మంది పిల్లలు అదనంగా చేరడమే దీనికి తార్కాణం.

ప్రైవేటు వలలో చిక్కకుండా..
ప్రతి కిలోమీటర్‌కు ప్రాథమిక, 3 కిలోమీటర్లకు యూపీ, 5 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల చొప్పున అందుబాటులో ఉంచినా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలు గతంలో అంతంతమాత్రమే ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 72 లక్షల మంది పాఠశాల విద్యార్థులు ఉండగా.. వారిలో 37 లక్షల మంది 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. కానీ.. అంతేమంది విద్యార్థులు కేవలం 15 వేల ప్రైవేట్‌/కార్పొరేట్‌ స్కూళ్లలో చేరుతున్నారు. నాణ్యమైన విద్య పేరిట ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న మాయాజాలంలో చిక్కుకుని తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోరుకునే రీతిలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
చదవండి: నూతన విద్యా విధానంతో పాఠశాల విద్యలో కొత్త మార్పులు: ఇకపై మూడు రకాల పాఠశాలలు

మరిన్ని చర్యలకు శ్రీకారం
విద్యార్థులందరికీ చిన్నప్పటి నుంచే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా సీఎం వైఎస్‌ జగన్‌ తాజాగా మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. పిల్లల మానసిక, మేథోపరమైన ఎదుగుదలను అనుసరించి జ్ఞానాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పాఠశాల విద్యారంగాన్ని మూడంచెలుగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. 3–6 సంవత్సరాల మధ్య కాలంలో పిల్లల్లో మెదడు ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆ సమయంలోనే వారికి సరైన జ్ఞానాన్ని అందించే అవకాశం లేకుండా పోతోంది. విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే బాల్యం నుంచే వారికి గట్టి పునాది పడాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల వయసు నుంచే పిల్లల్లో జ్ఞానాభివృద్ధి కోసం ఫౌండేషన్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మూడు విభాగాలుగా..
పూర్వప్రాథమిక విద్యలో వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ–1 (పీపీ–1) వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ–2 (పీపీ–2) ఉంటాయి.
ఫౌండేషన్‌ స్కూళ్లలో పీపీ–1 పీపీ–2, ప్రిపరేటరీ–1, క్లాస్‌–1, క్లాస్‌–2 ఉంటాయి. వీటిలో అంగన్‌వాడీ సిబ్బంది, విద్యా శాఖ నుంచి టీచర్లు ఉంటారు. ఇలాంటి స్కూళ్లు ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉంటాయి. దీని ప్రకారం ఒకటో తరగతికి గతంలో ఐదేళ్లు అర్హతగా ఉండగా.. ఇప్పుడది ఆరేళ్లుగా ఉంటుంది. అంటే మూడేళ్ల పిల్లలు పీపీ–1, పీపీ–2, ప్రిపరేటరీ–1, 1వ తరగతి, 2వ తరగతిని ఫౌండేషన్‌ స్కూళ్లలో పూర్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వాటికి అనుసంధానం చేస్తారు. ఇతర అంగన్‌వాడీ కేంద్రాలను అక్కడి పరిస్థితిని అనుసరించి ప్రిపరేటరీ–1, క్లాస్‌–1, క్లాస్‌–2 ఏర్పాటు చేయడం.. లేదంటే యధాతథంగా ఉంచడం వంటి చర్యలు చేపడతారు.
ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని యూపీ, హైస్కూల్‌ విభాగాల్లోకి మార్పు చేస్తారు. అవకాశాలు, అవసరాలను అనుసరించి యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా మార్పు చేయడం, హైస్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ తరగతుల ఏర్పాటు వంటి చర్యలు చేపడతారు. దీనివల్ల వనరులన్నీ ఒకేచోట అందుబాటులో ఉండి విద్యార్థులకు మరింత గుణాత్మక విద్యను అందించడానికి వీలుంటుంది.

Published date : 09 Jun 2021 01:24PM

Photo Stories