మేలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలలో దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ జారీ కానుంది.
శుక్రవారం జరిగిన దోస్త్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల కోఆర్డినేటర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ప్రవేశాలతోపాటు విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులపైనా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎక్కువ దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించకుండా, డిగ్రీ ప్రవేశాలను మూడు దఫాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సవరించుకునేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే సవరించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఫొటో మార్చుకోవాలన్నా, పేరులో తప్పులు దొర్లినా, పుట్టిన తేదీలో తప్పులు దొర్లినా, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సమాచారంలో తప్పులు దొర్లినా సవరించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఎడిట్ చేసుకునేలా ఆప్షన్ ఇస్తున్నారు. విద్యార్థి ద్వితీయ భాషను తాను చేరిన కాలేజీలోనే మార్చుకునేలా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థికి మూడు విధాలుగా అందించనున్నారు. విద్యార్థి ఇచ్చే మొబైల్ నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించడంతోపాటు మెయిల్ ఐడీకి సమాచారం ఇవ్వాలని, ఇటు విద్యార్థికి వాట్సాప్‌లోనూ సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 60 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థి లాగిన్ అయిన ప్రతిసారీ వేర్వేరు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. గతంలో ఒకసారి ఇచ్చిన ఓటీపీనే పలుమార్లు వినియోగించిన నేపథ్యంలో కాలేజీలు విద్యార్థుల నుంచి ఆ ఓటీపీ తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published date : 29 Feb 2020 02:17PM