మెడికల్ కౌన్సిల్ తరహాలో అగ్రికల్చర్ కౌన్సిల్:మంత్రి కన్నబాబు
Sakshi Education
సాక్షి, అమరావతి : దేశంలో ప్రస్తుతం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా), డీసీఐ (డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఎలా ఉన్నాయో అలానే రాష్ట్రంలో అగ్రికల్చర్ కౌన్సిల్ పని చేస్తుందని, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
బుధవారం ఆయన అసెంబ్లీలో వ్యవసాయ మండలి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశంలో తొలిసారి ఈ బిల్లును తీసుకొచ్చిన ఘనత ఏపీదేనన్నారు. రాష్ట్రంలో పలు వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు అనుమతులు లేకుండా ఉన్నాయని.. ఇకపై కౌన్సిల్ అనుమతి లేకుండా నడిపేందుకు వీలు లేదన్నారు. ఎంబీబీఎస్ వైద్యులు, దంత వైద్యులకు రిజిస్ట్రేషన్ నంబర్లు ఇచ్చినట్టే ఇకపై అగ్రికల్చర్ పట్టభద్రులకూ రిజిస్ట్రేషన్ ఉంటుందని, వీళ్లు కూడా ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో నియామకాలు జరిగితే అనుమతులు లేని కళాశాలల నుంచి చదివిన వారు వచ్చారని, వారిని తీసుకోవాలా వద్దా అనే విషయంపై ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఇకపై ఎంటర్‌ప్రెన్యూర్, మార్కెటింగ్, ప్రైవేటు వ్యవసాయ కాలేజీలు అన్నీ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయన్నారు.
Published date : 03 Dec 2020 05:11PM