Skip to main content

కెరీర్‌ గైడెన్స్ సెంటర్లుగా ఏపీలో 14 ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు.. ఎలా ఉంటాయంటే..

సాక్షి, అమరావతి: పురపాలక పాఠశాలల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
వారికి ఇంగ్లిష్‌ భాషలో విషయ పరిజ్ఞానం పెంపొందించేందుకు రాష్ట్రంలో 14 ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 13 జిల్లా కేంద్రాలతోపాటు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వీటిని నెలకొల్పుతారు. దీనికోసం ఇప్పటికే కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్‌, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టిసారించి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒలంపియాడ్‌ విధానంలో శిక్షణ ఇవ్వనుంది.

ల్యాబ్‌లే కెరీర్‌ గైడెన్స్ సెంటర్లు
ఇంగ్లిష్‌ ల్యాబ్‌లనే విద్యార్థుల కెరీర్‌ గైడెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తేవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. అన్ని పురపాలక పాఠశాలలను ఇంగ్లిష్‌ ల్యాబ్‌లతో అనుసంధానిస్తారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం సమకూర్చడంతోపాటు కౌన్సెలర్లను కూడా నియమిస్తుంది. వీరు చిల్డ్రన్‌ ఒలంపియాడ్స్‌ను నిర్వహిస్తూ విద్యార్థుల ఆసక్తి, స్థాయిలను గుర్తిస్తారు. తద్వారా వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను వివరించి.. ఉన్నత విద్య, కెరీర్‌ ఎంపిక దిశగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రధానంగా విదేశాల్లో విద్యాభ్యాసం కోసం అవసరమైన ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో అర్హత సాధించేందుకు శిక్షణ ఇస్తారు. ఏటా కనీసం 1,500 మంది విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించేలా చేయాలని పురపాలక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యసాధన దిశగా వారిని నడిపేందుకు కేంబ్రిడ్జ్‌ వర్సిటీ ప్రత్యేకంగా ఇ–కరిక్యులంను రూపొందిస్తుంది. దీనికోసం పురపాలక శాఖ రాష్ట్రంలో మూడు డిజిటల్‌ స్టూడియోలను ఏర్పాటు చేయనుంది. కెరీర్‌ గైడెన్స్ కేంద్రాలతో రాష్ట్రంలో 2,100 పురపాలక పాఠశాలల్లోని దాదాపు 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఇప్పటికే కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నిపుణులతో రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది పురపాలక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
Published date : 02 Mar 2021 02:40PM

Photo Stories